Islamabad magistrate issues arrest warrant against Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్టుకు రంగం సిద్ధం అవుతోంది. ఇమ్రాన్ ఖాన్ పై ఇస్లామాబాద్ మేజిస్ట్రేట్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. మహిళా న్యాయమూర్తిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ఇస్లామాబాద్ కోర్టు అరెస్ట్ చేయాలని వారెంట్ జారీ చేసినట్లు పాకిస్తాన్ మీడియా వెల్లడించింది. పీటీఐ పార్టీ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ ప్రధాని పదవి కోల్పోయిన తర్వాత నుంచి పాకిస్తాన్ వ్యాప్తంగా పర్యటిస్తూ..పీఎం షహబాజ్ షరీఫ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు.
ఆగస్టు 20న ఇస్లామాబాద్ లో నిర్వహించిన ఓ ర్యాలీలో ఇమ్రాన్ ఖాన్ అడిషనల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జి జెబా చౌదరిని బెదిరిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలపై ఇస్లామాబాద్ లోని మర్గల్లా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. నాలుగు సెక్షన్ల కింద ఇమ్రాన్ ఖాన్ పై కేసులు బుక్ అయ్యాయి. జడ్జితో పాటు పోలీస్ అధికారులను బెదిరిస్తూ.. జడ్జిన, డీఐజీని వదిలిపెట్టబోనని హెచ్చరిస్తూ వ్యాఖ్యలు చేశారు. ఇమ్రాన్ ఖాన్ సన్నిహితుడు షాబాజ్ గిల్ ను అరెస్ట్ చేయడంపై ఈ వ్యాఖ్యలు చేశాడు ఇమ్రాన్ ఖాన్.
Read Also: Pakistan: పాకిస్తాన్‌లో డెంగ్యూ కలకలం.. ఈ ఏడాది 30 వేలకు పైగా కేసులు
న్యాయమూర్తిని బెదిరించిన కేసులో ఇమ్రాన్ ఖాన్ పై అత్యంత తీవ్రమైన ఉగ్రవాద నిరోధక చట్టం ప్రకారం కేసులు పెట్టారు పాకిస్తాన్ పోలీసులు. ఇదిలా ఉంటే ఇటీవల ఏ కోర్టు, న్యాయవ్యవస్థ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా భవిష్యత్తులో ఎలాంటి చర్యలకు పాల్పడబోనని క్షమాపణ చెప్పారు ఇమ్రాన్ ఖాన్. దీని తరువాత ఆయనపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది.
పాకిస్తాన్ ప్రధానిగా పదవి కోల్పోయినప్పటి నుంచి ఇమ్రాన్ ఖాన్, పీఎం షాబాజ్ షరీఫ్ కు వ్యతిరేకంగా ర్యాలీలు, సభలు నిర్వహిస్తున్నారు. పాక్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ.. భారత ప్రభుత్వంపై పొగడ్తలు కురిపిస్తున్నారు. పాకిస్తాన్ ప్రభుత్వం అమెరికా చెప్పినట్లు వింటోందని.. విదేశీ శక్తులు పాకిస్తాన్ ను అడిస్తున్నాయంటూ షాహబాజ్ షరీఫ్ పై విమర్శలు కురిపిస్తున్నారు. భారతదేశాన్ని ఏ సూపర్ పవర్ కూడా ఏం చేయలేదని, భారత ప్రభుత్వం విదేశాంగ శాఖ స్వతంత్రంగా వ్యవహరిస్తుందని పలు సందర్బాల్లో ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలు చేశారు.