Isaac Johnson With Biggest Mouth Breaks His Own Guinness World Record: నోరు తెరిస్తే, ఎవరైనా గిన్నిస్ బుక్ రికార్డులకెక్కుతారా? కానీ, ఓ బుడ్డోడు మాత్రం ఆ ఘనత సాధించాడు. ఎందుకంటే.. అతని నోరు చాలా పెద్దది. ‘మమ్మీ’ సినిమాలో విలన్ ఎంత పెద్ద నోరు తెరుస్తాడో, దాదాపు అంతే సమానంగా ఈ టీనేజర్ తన నోరును తెరుస్తాడు. అందుకే, అతడు గిన్నిస్ బుక్ రికార్డులకెక్కాడు. అతడి పేరు ఐజాక్ జాన్సన్ (Isaac Johnson). అమెరికాలోని మిన్నెసోటాలో ఉంటాడు. 2019లోనే ఈ ఐజాక్ ఏకంగా 3.67 అంగుళాల మేర నోటిని తెరిచి, అప్పట్లో చరిత్ర సృష్టించాడు. అయితే.. ఆ తర్వాత అమెరికాకు చెందిన ఫిలిప్ ఆంగస్ అనే మరో యువకుడు, అతనికన్నా కొంచెం పెద్దగా (3.75 అంగుళాలు) నోరు తెరిచి, ఆ టీనేజర్ రికార్డ్‌ని బద్దలుకొట్టాడు.
అప్పటినుంచి ఐజాక్ మళ్లీ ప్రయత్నాలు మొదలుపెట్టాడు. తన నోరుని ఇంకా పెద్దగా తెరిచి, ఎవ్వరికీ సాధ్యం కాని రికార్డ్‌ని నెలకొల్పాలని నిర్ణయించుకున్నాడు. ఎట్టకేలకు తాను అనుకున్నదే సాధించగలిగాడు. 2020లో జరిగిన పోటీల్లో భాగంగా.. ఐజాక్ ఏకంగా 4 అంగుళాల మేర నోటిని తెరిచి రికార్డ్ సృష్టించాడు. ఇంతవరకూ ఆ రికార్డ్‌ని బ్రేక్ చేయలేదు. తాజాగా మరోసారి తన రికార్డ్‌ని తానే బ్రేక్ చేసుకున్నాడు ఐజాక్. ఈసారి తన నోటిని 4.014 అంగుళాల (10.196 సెంటీమీటర్లు) మేర తెరిచాడు. దీంతో.. పురుషుల్లో అత్యధిక వెడల్పుతో నోరు తెరిచిన వ్యక్తిగా చరిత్రపుటలకెక్కాడు. ఇతడు ఒకేసారి నాలుగు మెక్‌డోనాల్డ్ చీస్ బర్గర్లను ఒకదాని మీద మరొకటి పేర్చి తినేయగలడు. అంతేకాదు.. అంతేకాదు కోకాకోలా టిన్, ప్రింగిల్స్ చిప్స్ టిన్‌లను సైతం నోటిలో పెట్టుకొని చూపించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను, గిన్నిస్ బుక్ సంస్థ యూట్యూబ్‌లో పెట్టింది. ప్రస్తుతం అది నెట్టింట్లో వైరల్ అవుతోంది.