ఉక్రెయిన్ యుద్ధం రోజులకు రోజులుగా సాగుతుండటం రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్ ఆలోచనలపై తీవ్ర ప్రభావం చూపుతోందా? ఆయన అనుకున్నది ఒకటైతే జరుగుతోంది మరొకటా? రష్యా సైన్యం ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భావవనలో ప్రస్తుతం పుతిన్ ఉన్నారు. సంవత్సరాలుగా ఆయన మనసెరిగిన పశ్చిమ దేశాల గూఢచార వర్గాలు ఈ అంచనాకు వచ్చారు. పుతిన్ ఇకముందు ఎలాంటి చర్యలకు దిగుతాడో ఆర్థంకాక ఆందోళన చెందుతున్నారు.
ఉక్రెయిన్‌పై యుద్దం సాగుతున్న తీరు పుతిన్‌ను తీవ్ర ఒత్తిడికి గురిచేస్తోంది. ఆయన ఆరోగ్యంపైనా అనుమనాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సంక్షోభ సమయంలో పుతిన్ పూర్తిగా ఒంటరితనం కోరుకుంటున్నారనే విశ్లేషణలు కూడా ఉన్నాయి. వాస్తవానికి ఉక్రెయిన్‌పై సైనిక చర్యకు రూపకల్పన చేసింది సైనికాధికారులు కాదట. కేజీబీ అధికారి ఒకరు దానిని రూపొందించారని నిఘా సంస్థలు అంటున్నాయి.
నిజానికి ఉక్రెయిన్‌పై దాడి రష్యా మిలిటరీ కమాండర్లకు ఇష్టం లేదని, ఏం జరుగుతుందో అర్థంకాని స్థితిలో సైనికులు సరిహద్దులకు వెళ్లారని అంటున్నారు. నిజానికి, రష్యా సైనిక దాడిపై, సైనిక ప్రణాళికలపై అక్కడి నేతల కన్నా పశ్చిమ దేశాల ఏజెంట్ల దగ్గరే ఎక్కువ సమాచారం ఉంది. కానీ పుతిన్ తరువాత అడుగు ఎటు వేస్తారనేది వారికి కూడా తెలియదు. పుతిన్ ఏం చేయబోతున్నాడో తెలుసుకోవటం దాదాపు అసంభవం. ఎందుకంటే ఆయన దగ్గర సమిష్టి నిర్ణయాలకు స్థానం లేదు. ఏ నిర్ణయం తీసుకున్నా ఒక్కడే తీసుకుంటాడు.
పుతిన్ తరచూ బహిరంగ ప్రకటనలు చేస్తుంటారు. వాటి ద్వారా ఆయన ఉద్దేశాలపై కొంత అవగాహన కలిగే వీలుంది. కానీ అతడు ఎప్పుడు ఎలా స్పందిస్తాడో నిఘా వర్గాలకు కూడా అంతుబట్టదు. పుతిన్ ఆలోచనలు ఎలా ఉంటాయో రష్యా ప్రజలకు కూడా అర్థం కాదు. ఇక మిగతా వారి సంగతి సరే సరి. పుతిన్ కేవలం కొందరి మాటలు మాత్రమే వింటాడు. చాలా తక్కువ మందితో మాట్లాడుతాడు. ఉక్రెయిన్‌పై సైనిక చర్య విషయంలో కూడా ఇదే జరిగిందని అమెరికా నిఘా అధికారులు నమ్ముతున్నారు.
సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం సమయంలో రష్యాకు ఎదురైన అవమానానికి బదులు తీర్చుకోవాలనే కోరిక పుతిన్‌లో బలంగా ఉంది. రష్యాను అణచివేసి తనను అధికారానికి దూరం చేయాలని పశ్చిమ దేశాలు చూస్తున్నాయని పుతిన్ బలంగా నమ్ముతాడు. అయితే.. ఎలాంటి ఆధారాలు లేకుండా కొందరు ఆయన అనారోగ్యం బారిన పడ్డారని ప్రచారం చేస్తున్నారు. ఆయన మానసిక పరిస్థితి గురించి ఎక్కువగా చర్చిస్తున్నారు. కరోనా సమయంలో పుతిన్ పూర్తిగా ఐసోలేషన్‌లోకి వెళ్లిపోయారు. అది ఆయన మానసిక పరిస్థితిపై ప్రభావం చూపే అవకాశం కొంతవరకు ఉంటే ఉండవచ్చు. కానీ రుగ్మత స్థాయిలో కాదు.
మరోవైపు ప్రస్తుత యుద్ధంలో వాస్తవంగా ఏం జరుగుతుందనే దాని మీద పుతిన్‌కు ఖచ్చితమైన సమాచారం లేదనే వాదన వినిపిస్తోంది. ఆయనకు భయపడి నిఘా సంస్థలు వాస్తవ సమాచారాన్ని దాస్తున్నారని అంటున్నారనే కథనాలు వెలువడుతున్నాయి. అందుకే ఇప్పుడు ఆయన తనకు తాను ఓ చీకటి గదిలో ఉన్న భావనలో ఉన్నారు. తాను బలహీనపడినట్టు భావిస్తే మరింత ప్రమాదకరంగా మారే ప్రమాదం ఉంది. కనుక ముందు పశ్చిమ దేశాలు రెచ్చగొట్టే చర్యలు ఆపి సంక్షోభం పరిష్కారానికి వేగంగా అడుగులు వేయటం ముఖ్యం.
