Imran Vs Asim: ఒక్క సంతకం… కేవలం ఒకే ఒక్క సంతకం… ఒక దేశ చరిత్రను, ఒక శక్తివంతమైన నాయకుడి తలరాతను ఎలా మార్చేస్తుందో తెలుసా? 2019లో ఇమ్రాన్ ఖాన్ పెట్టిన ఆ ఒక్క సంతకం, ఇప్పుడు 2025లో ఆయన ప్రాణాల మీదకు తెచ్చింది. ప్రస్తుతం పాకిస్తాన్ లోని అడియాలా జైలు గోడల వెనుక అసలేం జరుగుతోంది?, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ బతికే ఉన్నారా? లేక బయటకు పొక్కనివ్వకుండా ఏదైనా జరగరానిది జరిగిందా? అర్ధరాత్రి కరెంట్ తీసేసి… ఆయన కుటుంబ సభ్యులపై జరుగుతున్న దాడుల వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి?, ఇది రాజకీయమా? లేక ఒక ఆర్మీ జనరల్ తీర్చుకుంటున్న వ్యక్తిగత పగా?, పాకిస్తాన్ రాజకీయ చదరంగంలో జరుగుతున్న అసలు కథను, దాని వెనుక ఉన్న రక్తచరిత్రను విశ్లేషిద్దాం.
పాకిస్తాన్ ఇప్పుడు నిప్పుల కొలిమిలా మారింది. గత కొన్ని వారాలుగా ఇమ్రాన్ ఖాన్ ను కలవడానికి ఎవరినీ అనుమతించడం లేదు. లాయర్లను అడ్డుకుంటున్నారు, డాక్టర్లను వెనక్కి పంపుతున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఒకటే భయం… “ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం క్షిణించిందా? లేక ఆయన జైల్లోనే మరణించారా?” ఈ డౌట్స్ క్లారిఫై చేసుకునేందుకు ఇమ్రాన్ ఖాన్ సిస్టర్స్ ఇద్దరూ అడియాలా జైలుకు వెళ్తే… అక్కడ జరిగింది చూసి పాకిస్తాన్ ఉలిక్కిపడింది. అర్ధరాత్రి వీధి లైట్లు ఆపేసి, చీకట్లో వారిని రోడ్లపై ఈడ్చుకెళ్లి అరెస్ట్ చేశారు. ఒక మాజీ ప్రధాని కుటుంబానికే రక్షణ లేకపోతే, సామాన్యుల పరిస్థితి ఏంటి? ప్రభుత్వం మాత్రం “ఆయన క్షేమంగానే ఉన్నారు” అని చెబుతోంది. కానీ క్షేమంగా ఉంటే వీడియో కాల్ లో ఎందుకు చూపించడం లేదు? అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న.
అయితే, ఇమ్రాన్ ఖాన్ కు పట్టిన ఈ దుస్థితికి కారణం ఇప్పుడే పుట్టింది కాదు. దీని వెనుక 6 ఏళ్ల క్రితం జరిగిన ఒక ‘ఈగో వార్’ ఉంది.సినిమాల్లో చూపించే రివేంజ్ డ్రామా కంటే ఇది పవర్ ఫుల్. ఫ్లాష్ బ్యాక్ వెళ్తే.. అది.. 2019. అప్పుడు ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ ప్రధాని. జనరల్ అసీమ్ మునీర్ అప్పుడు పాక్ గూఢచారి సంస్థ ISIకి చీఫ్. వీరిద్దరూ అప్పుడు స్నేహితులే. కానీ ఒక రోజు, అసీమ్ మునీర్ నేరుగా ప్రధాని ఇమ్రాన్ దగ్గరికి వెళ్లి… ఇమ్రాన్ భార్య ‘బుష్రా బీబీ’, ఆమె స్నేహితురాలు చేస్తున్న అవినీతికి సంబంధించిన సాక్ష్యాలను టేబుల్ మీద పెట్టారు.
“సార్, మీ ఇంట్లోనే తప్పు జరుగుతోంది” అని చెప్పడమే మునీర్ చేసిన నేరం. దీన్ని తన అవమానంగా భావించిన ఇమ్రాన్ ఖాన్… ఆగ్రహంతో ఊగిపోయి, వెంటనే అసీమ్ మునీర్ ను ISI చీఫ్ పదవి నుంచి తొలగించారు. అసీమ్ మునీర్ కెరీర్ లో అదొక మాయని మచ్చ. కానీ కాలం చాలా బలమైనది. 2022లో ఇమ్రాన్ ప్రభుత్వం కూలిపోయాక… విధి వెక్కిరించినట్టుగా, అదే అసీమ్ మునీర్ పాకిస్తాన్ కు “ఆర్మీ చీఫ్” అయ్యారు.ఎవరైతే తనను అవమానించి గెంటేశారో, ఇప్పుడు ఆయనే మునీర్ చేతిలో చిక్కుకున్నారు. ఇప్పుడు జరుగుతున్నదంతా… ఆ పాత పగకు అసీమ్ మునీర్ ఇస్తున్న ‘రిటర్న్ గిఫ్ట్’ అని విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే ఇమ్రాన్ ను రాజకీయంగానే కాదు, భౌతికంగా కూడా అంతం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి.
కానీ, పాకిస్తాన్ లో ఒక ప్రధాని జైలు పాలవ్వడం ఇదే మొదటిసారి కాదు. అక్కడ ప్రధానమంత్రి కుర్చీ, ‘ఎలక్ట్రిక్ చైర్’ లాంటిది. పాకిస్తాన్ చరిత్ర మొత్తం ప్రజాస్వామ్య నేతల రక్తంతోనే రాశారు. మీకు జుల్ఫికర్ అలీ భుట్టో గుర్తుండే ఉంటారు. 1979లో పాకిస్తాన్ ప్రజలు ఆయన్ను నెత్తిన పెట్టుకున్నారు. కానీ అప్పటి ఆర్మీ చీఫ్ జియా-ఉల్-హక్, భుట్టోను ఒక దొంగ కేసులో ఇరికించి, జైల్లో పెట్టి, చివరికి రాత్రికి రాత్రే ఉరి తీయించారు. ఆ తర్వాత ఆయన కూతురు బెనజీర్ భుట్టోను నడిరోడ్డుపై కాల్చి చంపారు. నవాజ్ షరీఫ్ ను దేశం నుంచి తరిమేశారు. ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ వంతు. గతంలో భుట్టోను ఎలాగైతే ప్రపంచానికి దూరం చేసి, జైలు గోడల మధ్య ఏకాకిని చేశారో… ఇప్పుడు ఇమ్రాన్ ను కూడా అలాగే చేస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ పార్టీని ముక్కలు చేయడం, ఎన్నికల గుర్తును లాక్కోవడం, ఇప్పుడు ఆయన ప్రాణాల మీదకు తేవడం… ఇదంతా చూస్తుంటే చరిత్ర మళ్ళీ పునరావృతం అవుతోందా అనిపిస్తోంది.
పాకిస్తాన్ లో ప్రస్తుత పరిస్థితిని పొలిటికల్ ఎక్స్ పర్ట్స్ “సైలెంట్ కూప్” గా భావిస్తున్నారు. అంటే.. మిలిటరీ అధికారాన్ని డైరెక్ట్ గా తీసుకోకుండానే… వెనకుండి మొత్తం నడిపించడం. న్యాయస్థానాల అధికారాలను తగ్గించడం, మిలిటరీ కోర్టులను బలోపేతం చేయడం, ఇంటర్నెట్ ను షట్ డౌన్ చేసి ప్రజల గొంతు నొక్కడం… ఇవన్నీ ఇమ్రాన్ ఖాన్ అనే “వ్యక్తి”ని మాత్రమే కాదు, ఇమ్రాన్ ఖాన్ అనే “ఆలోచన”ను చంపేయడానికి జరుగుతున్న అతిపెద్ద కుట్రగా భావించవచ్చు. ఫీల్డ్ మార్షల్ గా తిరుగులేని అధికారాలను చేజిక్కించుకున్న అసీమ్ మునీర్, తన శతృవులను వ్యూహాత్మకంగా అణచివేస్తున్నారని చెప్పొచ్చు.
ఇమ్రాన్ ఖాన్ 2019లో అసీమ్ మునీర్ ను తొలగించి ఉండకపోతే, ఈరోజు ఆయన తలరాత వేరేలా ఉండేదేమో! ప్రస్తుతానికైతే అడియాలా జైలు నుంచి ఎలాంటి వార్త వస్తుందోనని ప్రపంచం ఊపిరి బిగబట్టి చూస్తోంది. ఇమ్రాన్ ఖానే క్షేమంగానే ఉన్నారని జైలు అధికారులు ప్రకటించారు. అయితే ఆయన అభిమానులు మాత్రం నమ్మట్లేదు. ఒకవేళ ఇమ్రాన్ ఖాన్ కు ఏమైనా జరిగితే… పాకిస్తాన్ లో అంతర్యుద్ధం తప్పదా? లేదా ఆర్మీ తుపాకుల మోతకు ప్రజాస్వామ్యం మరోసారి బలైపోతుందా? ఇమ్రాన్ ఖాన్ ఈ పద్మవ్యూహం నుంచి బయటపడతారా?.. అనే ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.
