Iran: ఇరాన్‌లో ఘోరం.. ఆయుధ మిషన్ పేలి 14 మంది సైనికులు మృతి

  • ఇరాన్‌లో ఘోరం
  • ఆయుధ మిషన్ పేలి 14 మంది సైనికులు మృతి
  • ఆయుధాలు నిర్వీర్యం చేస్తుండగా ఒక్కసారిగా పేలుడు
Iran

Iran

ఇరాన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఆయుధాలను తొలగించే క్రమంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 14 మంది ఐఆర్‌జీసీ సైనికులు ప్రాణాలు కోల్పోగా.. ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటన ఇరాన్‌కు భారీ దెబ్బగా చెప్పొచ్చు.

ప్రస్తుతం ఇరాన్-అమెరికా మధ్య యుద్ధాన్ని ముగించేందుకు చర్చలు సాగుతున్నాయి. ఇలాంటి తరుణంలో ఇరాన్ వాయువ్య భాగంలో జంజాన్ అనే ప్రావిన్స్‌లో భూమిలో పాతిపెట్టిన బాంబులు, మందుగుండు సామగ్రిని నిర్వీర్యం చేస్తుండగా ఒక పేలని బాంబు అకస్మాత్తుగా పేలింది. దీంతో అక్కడికక్కడే 14 మంది ఐఆర్‌జీసీ సైనికులు మరణించగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. ఆ ప్రాంతంలోని సుమారు 1,200 హెక్టార్ల వ్యవసాయ భూమిలో పేలని బాంబుల కారణంగా ప్రమాదంలో ఉందని ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థ ఫార్స్ న్యూస్ నివేదించింది.

ట్రంప్..
వైట్‌హౌస్‌లో ట్రంప్ మాట్లాడుతూ.. ఇరాన్ ఒక కొత్త ప్రతిపాదనను పంపిందని.. అయితే దానితో తాను సంతోషంగా లేనని చెప్పారు. ‘‘వారు ఒప్పందం చేసుకోవాలనుకుంటున్నారు.. కానీ నేను దానితో సంతృప్తిగా లేను. ఏం జరుగుతుందో చూద్దాం.’’ అని అన్నారు. ఇరాన్ కచ్చితంగా కొన్ని చర్యలు తీసుకుందని.. అయితే చివరికి ఏదైనా ఒప్పందానికి రాగలదో లేదో తనకు కచ్చితంగా తెలియదని పేర్కొన్నారు. ఇరాన్ నాయకత్వం తీవ్రంగా విచ్ఛిన్నమైందన్నారు. అన్ని వర్గాలు ఏదో ఒక రకమైన ఒప్పందాన్ని కోరుకుంటున్నాయని అంగీకరించినప్పటికీ.. ఈ విభజన చర్చల్లో ఇబ్బందులను కలిగిస్తోందని ట్రంప్ అన్నారు.