Iran: ఈసారి శత్రువు కాలుదువ్వితే కొత్త యుద్ధం చూస్తారు.. ఇరాన్ వార్నింగ్

  • మళ్లీ టెన్షన్ పుట్టిస్తున్న హెచ్చరికలు
  • ఎటూ తెగని ఇరాన్-అమెరికా పంచాయితీ
  • తాజాగా శత్రువులకు ఇరాన్ వార్నింగ్
Iranus

Iranus

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు తలెత్తవచ్చనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ మేరకు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు సఫలీకృతం కాకపోవడంతో ప్రతిష్టంభన అలా కొనసాగుతూనే ఉంది. తాజాగా ఇరాన్ ప్రతిపాదనలను అమెరికా తిరస్కరించింది. దీంతో మధ్యప్రాచ్యంలో యుద్ధం జరగొచ్చని వార్తలు హల్‌చల్ చేశాయి. అయితే సైనిక దాడిని ప్రస్తుతం ట్రంప్ తాత్కాలికంగా వాయిదా వేశారు. దీంతో అంతర్జాతీయంగా ప్రశాంత నెలకొంది.

ఇదిలా ఉంటే ఇరాన్ మాత్రం గట్టి వార్నింగ్‌లు ఇచ్చింది. అమెరికా లేదా ఇజ్రాయెల్ మళ్లీ దాడులకు దిగితే మాత్రం ఈసారి కొత్త యుద్ధాన్ని చూస్తారని హెచ్చరించింది. శాంతి ప్రతిపాదనపై ప్రతిష్టంభన కొనసాగుతున్న నేపథ్యంలో ఇరాన్ ఈ హెచ్చరికలు చేయడం అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది.

ఇరాన్ సైన్య ప్రతినిధి మొహమ్మద్ అక్రమినియా మాట్లాడుతూ.. ‘‘శత్రువులు మరోసారి జియోనిస్టుల ఉచ్చులో పడి ఇరాన్‌పై కొత్త దాడులు చేస్తే.. కొత్త ఆయుధాలు, కొత్త వ్యూహాలతో కొత్త యుద్ధ ఫ్రంట్‌లను ప్రారంభిస్తాం’’ అని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలను ఇరాన్ అధికారిక వార్తా సంస్థ ISNA వెల్లడించింది.

ఇదిలా ఉంటే ట్రంప్ ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. మే 19న జరగాల్సిన ఇరాన్‌పై సైనిక దాడిని తాత్కాలికంగా వాయిదా వేసినట్లు ప్రకటించారు. మధ్యప్రాచ్య దేశాల అభ్యర్థన మేరకు చర్చలకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. ట్రంప్ సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో స్పందిస్తూ.. ‘‘ప్రస్తుతం కీలక చర్చలు జరుగుతున్నాయి. అమెరికాకు మాత్రమే కాకుండా మధ్యప్రాచ్య దేశాలకు కూడా ఆమోదయోగ్యమైన ఒప్పందం కుదురుతుందని ఆశిస్తున్నాం. ముఖ్యంగా ఆ ఒప్పందంలో ఇరాన్‌కు అణ్వాయుధాలు ఉండకూడదు’’ అని పేర్కొన్నారు.

ఇక లీకైన ఇరాన్ సవరించిన ప్రతిపాదన ప్రకారం.. అధిక శుద్ధి చేసిన యురేనియం నిల్వలను అమెరికాకు కాకుండా రష్యాకు అప్పగించేందుకు షరతులతో కూడిన అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. అలాగే యుద్ధ పరిహారం డిమాండ్‌ను కూడా ఉపసంహరించుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.

మరోవైపు ఇరాన్ ఖాతమ్ అల్-అన్బియా సెంట్రల్ హెడ్‌క్వార్టర్స్ కమాండర్ మేజర్ జనరల్ అలీ అబ్దొల్లాహీ కూడా అమెరికా, దాని మిత్రదేశాలకు హెచ్చరికలు జారీ చేశారు. ‘‘ఇరాన్ సైన్యం గతం కంటే మరింత బలంగా సిద్ధంగా ఉంది. మా చేతులు ఇప్పటికే ట్రిగ్గర్‌పై ఉన్నాయి. మరోసారి తప్పు అంచనాలు వేస్తే గత యుద్ధాల కంటే తీవ్రమైన ప్రతిస్పందన ఉంటుంది’’ అని హెచ్చరించారు.

ఇక ఫార్స్ న్యూస్ ఏజెన్సీ కథనం ప్రకారం.. అమెరికా ఇరాన్‌పై కొన్ని కీలక షరతులు విధించింది. 400 కిలోల శుద్ధి చేసిన యురేనియంను అప్పగించడం, ఒకే అణు కేంద్రాన్ని కొనసాగించడం, యుద్ధ పరిహారం డిమాండ్‌ను వదిలేయడం వంటి అంశాలను అమెరికా కోరుతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇరాన్‌కు సంబంధించిన ఎక్కువ శాతం ఫ్రీజ్ చేసిన ఆస్తులు అలాగే కొనసాగుతాయని కూడా సమాచారం. ప్రస్తుతం ఈ పరిణామాలతో పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ భయం నెలకొంది.