Iran Starlink Report: అమెరికా సైనికులపై దాడులకు ఇరాన్ Starlink వినియోగం?.. ఎలాన్ మస్క్ ఆగ్రహం..!

Iran Used Elon Musk's Starl

Iran Used Elon Musk's Starl

Iran Starlink Report: అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఎలాన్ మస్క్‌కు చెందిన SpaceX సంస్థ అందించే Starlink శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను ఇరాన్ తన సైనిక కార్యకలాపాలకు ఉపయోగించుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. పశ్చిమాసియాలో అమెరికా సైనిక దళాలకు వ్యతిరేకంగా చేపట్టిన కార్యకలాపాల్లో ఈ సాంకేతికతను వినియోగించినట్లు The Washington Post తన కథనంలో వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం.. ఇరాన్ సైనికుల కదలికలను సమన్వయం చేయడం, ఏకదిశ దాడి డ్రోన్లను (One-way attack drones) నిర్వహించడం వంటి పనులకు Starlink సేవలను ఉపయోగించినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై కార్యకలాపాల గురించి తెలిసిన నలుగురు వ్యక్తులను ఉటంకిస్తూ పత్రిక కథనం ప్రచురించింది.

అమెరికా, ఇజ్రాయెల్ మార్చి మొదటి వారంలో ఇరాన్‌పై బాంబు దాడులు ప్రారంభించగా.. ప్రతిగా ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లతో ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు నివేదిక పేర్కొంది. ఈ సమయంలో ఇరాన్ తన సైనిక కార్యకలాపాలకు Starlink సేవలను ఉపయోగిస్తున్నట్లు ఎలాన్ మస్క్‌కు తెలిసినట్లు సమాచారం. అదే సమయంలో అమెరికా సైన్యం కూడా Starlinkకు చెందిన సైనిక అవసరాల కోసం రూపొందించిన Starshield సేవలను వినియోగిస్తున్నట్లు ఆయన తెలుసుకున్నారని కథనం వెల్లడించింది. ఈ రెండు విషయాలపై మస్క్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు కంపెనీ అంతర్గత చర్చల గురించి తెలిసిన ఇద్దరు వ్యక్తులు తెలిపారని The Washington Post పేర్కొంది. అమెరికా సైన్యం తక్కువ ఖర్చుతో భూభాగ కార్యకలాపాల కోసం రూపొందించిన ప్రణాళిక కింద Starshieldను ఉపయోగించి ఏకదిశ దాడి డ్రోన్లను నిర్వహిస్తున్నట్లు నివేదిక తెలిపింది. అయితే, ఈ ఆరోపణలపై SpaceX లేదా ఎలాన్ మస్క్ స్పందించలేదు.

యుద్ధానికి సంబంధించిన రహస్య సమాచార సమావేశంలో ఇరాన్ సైనిక కార్యకలాపాలకు Starlink వినియోగం గురించి చర్చించినట్లు నివేదిక పేర్కొంది. ఈ వేసవిలో అమెరికా రక్షణ కార్యదర్శి పీట్ హెగ్‌సెత్‌కు అందించిన రహస్య నివేదికలో ఇరాన్ ఈ సాంకేతికతను కమాండ్ అండ్ కంట్రోల్ కార్యకలాపాలకు, డ్రోన్ మిషన్ల పర్యవేక్షణకు ఉపయోగించినట్లు వివరించినట్లు సమాచారం. అమెరికా దళాలు ఇరాన్ సంప్రదాయ కమ్యూనికేషన్ వ్యవస్థలను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో Starlink టెహ్రాన్‌కు ప్రత్యామ్నాయ సమాచార మార్గంగా ఉపయోగపడినట్లు కథనం పేర్కొంది.

అయితే, ఈ అంశంపై అమెరికా రక్షణ శాఖ ప్రతినిధి కింగ్స్లీ విల్సన్ స్పందిస్తూ.. ఈ విషయానికి సంబంధించి సెంట్రల్ కమాండ్ నుంచి రక్షణ కార్యదర్శి కార్యాలయానికి నివేదిక అందినట్లు తమకు తెలియదని తెలిపారు. ఇరాన్ సైనిక కార్యకలాపాల్లో Starlink వినియోగం, పోర్ట్ షుఐబా దాడిలో ఈ సేవల పాత్ర, Starshield ధరల అంశాలపై వ్యాఖ్యానించడానికి ఆమె నిరాకరించారు. అమెరికా సెంట్రల్ కమాండ్ కూడా ఈ విషయంపై స్పందించలేదు. దాడికి సంబంధించి పెంటగాన్ ఇప్పటివరకు తన పరిశోధన వివరాలను బహిరంగంగా వెల్లడించలేదు.

ఇరాన్‌లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలపై అణచివేత సమయంలో అధికారులు కమ్యూనికేషన్ వ్యవస్థలను నిలిపివేయడంతో.. జనవరిలో Starlink సేవలను వినియోగదారులకు ఉచితంగా అందుబాటులోకి తెచ్చినట్లు The New York Times గతంలో నివేదించింది. సాధారణ ప్రజలు, ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులు ఇంటర్నెట్‌కు కనెక్ట్ కావడానికి ఈ సేవలు ఉపయోగపడినట్లు సమాచారం. అయితే, Starlink టెర్మినల్స్ ప్రజల చేతుల్లోకి వెళ్లిన తర్వాత అవి ప్రత్యర్థుల చేతుల్లోకి వెళ్లకుండా అడ్డుకోవడం చాలా కష్టమని శాటిలైట్ పరిశ్రమకు చెందిన అధికారులు The Washington Postకు తెలిపారు. ఒకవైపు ఇరాన్‌లోని నిరసనకారులకు ఇంటర్నెట్ అందకుండా సేవలను నిలిపివేయాలా? లేక సేవలను కొనసాగించి ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) వాటిని ఉపయోగించే అవకాశాన్ని కల్పించాలా? అనే సందిగ్ధ పరిస్థితి ఉందని ఓ పరిశ్రమ అధికారి వివరించారు.

అమెరికా ఆంక్షలను తప్పించుకునేందుకు ఇరాన్‌కు విస్తృతమైన కొనుగోలు, సరఫరా నెట్‌వర్క్‌లు ఉన్నాయని అమెరికా ట్రెజరీ శాఖ మాజీ న్యాయవాది కారి స్టైన్‌బోవర్ పేర్కొన్నారు. మూడో దేశాల ద్వారా పనిచేసే షెల్ కంపెనీలు, మధ్యవర్తుల సహాయంతో Starlink టెర్మినల్స్‌ను పొందే అవకాశం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. “ఇరానీయులు ఈ విషయంలో చాలా నైపుణ్యం కలిగి ఉన్నారు” అని ఆమె పేర్కొన్నట్లు నివేదిక తెలిపింది. చట్టబద్ధమైన ఎగుమతిదారులను కూడా ఈ నెట్‌వర్క్‌లు మోసం చేసే అవకాశం ఉందని వివరించారు. ప్రత్యర్థి దేశాలు తమ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను ఉపయోగించకుండా అడ్డుకోవడం, అదే సమయంలో సాధారణ ప్రజలకు ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించడం SpaceXకు పెద్ద సవాలుగా మారిందని ఈ కథనం సూచిస్తోంది.