మధ్యప్రాచ్యం మరోసారి తీవ్ర స్థాయిలో అట్టుడుకుతోంది. 2, 3 వారాల్లో ఇరాన్ అంతు చూస్తామంటూ ట్రంప్ హెచ్చరించిన తర్వాత అమెరికా సైన్యం దాడులు తీవ్రతరం చేసింది. తాజాగా ఇరాన్‌లో అతి పెద్ద వంతెనపై అమెరికా దళాలు దాడులు చేశాయి. దీంతో వంతెన కూలిపోయింది. ఈ వంతెన ఇంకా నిర్మాణంలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అమెరికా చేసిన దాడిలో 8 మంది మృతి చెందగా.. 95 మంది వరకు గాయాలు పాలైనట్లుగా ఇరాన్ మీడియా పేర్కొంది. ఇక వంతెనపై దాడి చేసిన తర్వాత ఇరాన్‌పై మరిన్ని దాడులు జరగబోతున్నాయని ట్రంప్ పేర్కొన్నారు.
కూలిపోయిన అతి పెద్ద వంతెన ఇంకా నిర్మాణంలో ఉంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌ను పశ్చిమ నగరమైన కరాజ్‌తో కలుపుతుంది. 136 మీటర్ల ఎత్తులో ఈ వంతెనను నిర్మిస్తున్నారు. మధ్యప్రాచ్యపు ఇంజనీరింగ్ అద్భుతంగా ఈ వంతెన డిజైన్ చేశారు. వంతెనపై అమెరికా దాడి చేయగానే పెద్ద ఎత్తున పొగ ఆకాశాన్ని అంటింది. తొలి దాడి బాధితులకు సహాయం చేసేందుకు అత్యవసర బృందాలను ఘటనా స్థలానికి పంపిన సమయంలోనే రెండో దాడి జరిగిందని ఇరాన్ మీడియా పేర్కొంది.
ఇక దాడికి సంబంధించిన దృశ్యాలను ట్రంప్ ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేస్తూ.. ‘‘ఇరాన్‌లోని అతిపెద్ద వంతెన కూలిపోయింది. ఇకపై దాన్ని ఎప్పటికీ ఉపయోగించలేరు. ఇంకా మరెన్నో దాడులు జరగనున్నాయి.!’’ అని ట్రంప్ పేర్కొన్నారు. మరీ ఆలస్యం కాకముందే ఇరాన్ ఒక ఒప్పందం చేసుకోవాలని ట్రంప్ హెచ్చరించారు.
గురువారం అమెరికా ప్రజలను ఉద్దేశించి ట్రంప్ మాట్లాడుతూ.. అమెరికా భవిష్యత్ కోసం ఇరాన్‌తో యుద్ధం చేస్తున్నట్లుగా ప్రకటించారు. 2, 3 వారాల్లో ఇరాన్ అంతు చూస్తామంటూ ప్రకటించారు. అమెరికా నాశనం కావాలని కోరుకున్న వారి అంతు చూస్తామంటూ ఇరాన్‌ను ట్రంప్ హెచ్చరించారు. వార్నింగ్ ఇచ్చినట్లుగానే ప్రస్తుతం పశ్చిమాసియాలో దాడులు తీవ్రం అయ్యాయి.
