Strait of Hormuz: మిడిల్ ఈస్ట్ సంక్షోభం రోజురోజుకు పెరుగుతోంది. ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధం నేపథ్యంలో పరిస్థితులు వేడెక్కాయి. ఈ ఘర్షణలు ఏడో రోజుకు చేరకున్నాయి. ఇరు దేశాలు వైమానిక దాడులు, క్షిపణి దాడులు చేసుకుంటున్నాయి. ఇదిలా ఉంటే, ఇజ్రాయిల్‌తో వివాదం పెరుగుతున్న నేపథ్యంలో ‘‘హార్మూజ్ జలసంధి’’ని ఇరాన్ మూసివేయవచ్చని నివేదికలు చెబుతున్నాయి. ఇదే జరిగితే, ప్రపంచ వ్యాప్తంగా సంక్షోభం తప్పదు.
ప్రపంచంలోని రోజువారీ చమురు వినియోగంలో 20 శాతం ఈ హార్మూజ్ జలసంధి నుంచే ప్రయాణిస్తుంటుంది. ఈ జలసంధిని మూసేయడం ద్వారా తమ శత్రువులపై స్పందించడానికి ఒక ఎంపిక అని ఇరాన్ పార్లమెంట్ జాతీయ భద్రతా కమిటీ ప్రెసిడియం సభ్యుడు బెహ్నామ్ సయీది గురువారం సెమీ-అధికారిక మెహర్ వార్తా సంస్థకు తెలిపారు. పాశ్చాత్య దేశాల ఒత్తిడికి ప్రతీకారంగా హార్మూజ్ జలసంధిని మూసేస్తామని గతంలో కూడా ఇరాన్ బెదిరించింది.
READ ALSO: Shashi Tharoor: ‘‘బిన్ లాడెన్‌ను మర్చిపోయారా.?’’ ఆసిమ్ మునీర్‌లో లంచ్‌పై విమర్శలు..
అరేబియా సముద్రాన్ని, పర్షియన్ గల్ఫ్ ప్రాంతాన్ని కలిపే ఇరుకైన మార్గాన్ని ‘‘హార్మూజ్ జలసంధి’’గా పిలుస్తారు. సన్నటి ఈ సముద్రమార్గం గుండా కువైట్, బహ్రైన్, ఖతార్, యూఏఈ, సౌదీ అరేబియా , ఇరాన్ చమురు ఎగుమతులు కొనసాగుతాయి. ఈ ప్రాంతంలోని ద్వీపాలు ఎక్కువగా ఇరాన్ ఆధీనంలోనే ఉన్నాయి. వీటిలో ఇరాన్ మిలిటరీ ఉనికి ఉంది. పరిస్థితులు చేజారిపోతే, ఈ జలసంధిని ఇరాన్ మూసేసే అవకాశం ఉంది. 33 కి.మీ వెడల్పు ఉన్న ఈ ప్రాంతం ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతోంది. ముఖ్యంగా, ఆయిల్ దిగుమతులపై ఎక్కువగా ఆధారపడిన ఇండియా, చైనాకు ఇది ప్రమాదం.
ఈ మార్గం గుండా వచ్చే చమురు ఎగుమతుల్లో 82 శాతం ఆసియాకు వెళ్తున్నాయి. ఇందులో భారత్, చైనా, జపాన్, దక్షిణ కొరియా వాటా ఏకంగా 67 శాతం ఉంది. భారత్ ముడి చమురులో 90 శాతం చమురును మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. ఇందులో 40 శాతం హార్మూజ్ జలసంధి నుంచే వస్తున్నాయి. ఒక వేళ ఇరాన్ ఈ మార్గాన్ని మూసేస్తే ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం తలెత్తే అవకాశం ఉంది. ఫలితంగా చమురు ధరలు చుక్కల్ని అంటుతాయి.
