Iran Parliament Bill: పశ్చిమాసియా (మిడిల్ ఈస్ట్) లో ఉద్రిక్తతలు మునుపెన్నడూ లేని విధంగా అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహులను టార్గెట్ చేస్తూ ఇరాన్ పార్లమెంట్ (మజ్లిస్) ఒక సంచలన చట్టాన్ని తీసుకురాబోతోంది. ట్రంప్, నెతన్యాహులను అంతమొందించిన వారికి భారీ రివార్డు ప్రకటించేలా ఒక ప్రత్యేక బిల్లుపై ఇరాన్ ఎంపీలు చర్చిస్తున్నారు. ఈ విషయాన్ని ఇరాన్ జాతీయ భద్రతా కమిటీ అధ్యక్షుడు ఇబ్రహీం అజీజీ అధికారికంగా ధృవీకరించారు.
ఖమేనీ మృతికి ప్రతీకారం..
ఈ ఏడాది ఫిబ్రవరి 28న అమెరికా – ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌పై జరిపిన భారీ వైమానిక దాడుల్లో ఆ దేశ అత్యున్నత నాయకుడు అయతోల్లా అలీ ఖమేనీ మరణించారు. ఈ దారుణ ఉదంతానికి ప్రతీకారం తీర్చుకునేందుకే తాజాగా ఇరాన్ నాయకత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది.
పార్లమెంట్‌లో బిల్లు.. రూ.450 కోట్ల భారీ ఇనామ్!
బ్రిటన్‌కు చెందిన ప్రముఖ వార్తా సంస్థ ‘ది టెలిగ్రాఫ్’ నివేదిక ప్రకారం.. ఇరాన్ ఎంపీలు ప్రస్తుతం “ఇస్లామిక్ రిపబ్లిక్ సైనిక, భద్రతా దళాల పరస్పర ప్రతీకార చర్య” అనే పేరుతో ఒక ప్రత్యేక బిల్లును రెడీ చేస్తున్నారు. ఈ చట్టం ప్రకారం డొనాల్డ్ ట్రంప్‌ను హతమార్చిన ఏ వ్యక్తికైనా అధికారికంగా 50 మిలియన్ యూరోలు (సుమారు రూ.450 కోట్లు) బహుమతిగా అందజేస్తారు. అలీ ఖమేనీ మరణానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, యూఎస్ సెంట్రల్ కమాండ్ అడ్మిరల్ బ్రాడ్ కూపర్‌లే పూర్తి బాధ్యులని ఇబ్రహీం అజీజీ స్పష్టం చేశారు. వీరంతా కచ్చితంగా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు.
ఇటీవల ఇరాన్ జాతీయ భద్రతా కమిటీ వైస్ ఛైర్మన్ మహ్మూద్ నబవియాన్ మాట్లాడుతూ.. ట్రంప్, నెతన్యాహులను నరకానికి పంపే వారికి ‘భారీ బహుమతి’ ప్రకటించేందుకు పార్లమెంట్ అతి త్వరలోనే ఓటింగ్ నిర్వహించనుందని తెలిపారు. ఒకవేళ భవిష్యత్తులో ఇరాన్ లేదా తమ నాయకత్వంపై అమెరికా, ఇజ్రాయెల్ మళ్లీ దాడికి దిగితే, దాని పర్యవసానాలు కేవలం ఆ రెండు దేశాలకే పరిమితం కాబోవని హెచ్చరించారు. అమెరికా, ఇజ్రాయెల్‌కు వ్యూహాత్మకంగా మద్దతు ఇస్తున్న ప్రాంతీయ అరబ్ దేశాలు, వారి ప్రభుత్వాలు కూడా ఈ తీవ్రమైన ఎదురుదాడిని ఎదుర్కోవలసి ఉంటుందని ఆయన బాహాటంగానే హెచ్చరించారు.
గతంలోనూ ట్రంప్‌కు బెదిరింపులు
ఇరాన్ నుంచి ట్రంప్‌కు ఇలాంటి బెదిరింపులు రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ఇరాన్ టాప్ కమాండర్ ఖాసిం సులేమానీ, అలీ ఖమేనీ మరణాల తర్వాత ట్రంప్‌ను అంతమొందించేందుకు ఇరాన్‌లో వరుస ప్రచారాలు జరుగుతున్నాయి. గతంలో ట్రంప్ హత్య కోసం ప్రభుత్వం మద్దతు ఉన్న గ్రూపులు ఈ క్యాంపెయిన్ ద్వారా 27 మిలియన్ డాలర్లకు పైగా సేకరించినట్లు సమాచారం. ట్రంప్, నెతన్యాహుల చావు కోసం ఈ హ్యాకర్ల బృందం గతంలోనే 50 మిలియన్ డాలర్ల బహుమతిని ప్రకటించింది.
ఇరాన్ నుంచి వస్తున్న ఈ వరుస బెదిరింపులపై ఈ ఏడాది స్టార్టింగ్‌లోనే డొనాల్డ్ ట్రంప్ సంచలన హెచ్చరిక జారీ చేశారు. ఒకవేళ ఇరాన్ తనపై లేదా అమెరికా ప్రతినిధులపై ఎలాంటి దాడికి ప్రయత్నించినా.. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఏమాత్రం వెనకాడదని, ఇరాన్‌ను ప్రపంచ మ్యాప్ నుంచే పూర్తిగా తుడిచిపెట్టేస్తామని ట్రంప్ తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. ఇంతటి భారీ ఉద్రిక్తతల మధ్యనే అమెరికాతో ఇరాన్ పరోక్ష చర్చలు జరుపుతుండటం గమనార్హం. పాకిస్థాన్ మధ్యవర్తిత్వంలో ఈ శాంతి చర్చలు ముందుకు సాగుతున్నాయని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘేయ్ సూచనప్రాయంగా తెలిపారు.
