హార్ముజ్.. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వినపడుతున్న పేరు. ఎందుకంటే ప్రపంచ దేశాలకు ఇదే కేంద్ర బిందువు కావడం. అందుకే ప్రతి రోజూ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు హార్ముజ్నే. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడి చేసిన తర్వాత హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసేసింది. దీంతో గత 20 రోజులుగా హార్ముజ్‌లో ఆయా దేశాలకు చెందిన ఆయిల్ ట్యాంకర్లు నిలిచిపోయాయి. దీంతో ప్రపంచ దేశాలు చమురు, గ్యాస్ కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ఐరోపా దేశాలైతే తీవ్ర గ్యాస్ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. యుద్ధం సద్దుమణుగుతుందని అనుకుంటుంటే.. అందుకు భిన్నంగా రోజురోజుకు తీవ్రత పెరుగుతోంది. తాజాగా ఖతార్ గ్యాస్ క్షేత్రంపై ఇరాన్ క్షిపణి దాడి చేయడంతో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది.
ఈ నేపథ్యంలో హార్ముజ్ కోసం ఆరు దేశాలు చేతులు కలిపాయి. హార్ముజ్ జలసంధిలో చిక్కుకున్న ఆయిల్ ట్యాంకర్లకు మార్గం సుగమం చేసేందుకు ఐరోపా దేశాలు, జపాన్ చేతులు కలిపాయి. కీలకమైన సముద్ర మార్గం గుండా నౌకల సురక్షిత ప్రయాణాన్ని కొనసాగించడానికి తాము సిద్ధంగా ఉన్నామని బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, జపాన్ ఒక సంయుక్త ప్రకటనలో తెలిపాయి. ప్రపంచ దేశాలకు ఇరాన్ గ్యాస్, చమురు సంక్షోభం సృష్టించడం ఏ మాత్రం భావ్యం కాదని పేర్కొన్నాయి.
ఇక ఇటీవల ఇరాన్ జరిపిన దాడులను ఆరు దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఇటువంటి దాడులు ప్రపంచ ఇంధన సరఫరాలపై తీవ్ర ప్రభావం చూపిస్తాయని పేర్కొన్నాయి. ప్రస్తుతం పరిస్థితుల్ని చక్కదిద్దడానికి ఇంధన మార్కెట్‌ను స్థిరపరచడానికి, సముద్ర మార్గంలో సాధారణ రవాణా సాఫీగా కొనసాగించడానికి సమిష్టిగా పని చేస్తామని ఒక ప్రకటనలో తెలిపాయి.
ఇది కూడా చదవండి: Iran-Israel War: హార్ముజ్ కోసం ఏకమైన 6 దేశాలు.. నెక్ట్స్ యాక్షన్ ప్లాన్ ఇదే!
గత నెల 28న ఇరాన్ అధ్యక్ష భవనంపై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడి చేశాయి. ఈ ఘటనలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతమయ్యారు. అనంతరం ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది. ఇజ్రాయెల్, అమెరికా మద్దతు గల గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడింది. అంతేకాకుండా హార్ముజ్ జలసంధిని మూసేసింది. ఈ జలసంధి గుండానే ప్రపంచ దేశాలకు చెందిన ఆయిల్ ట్యాంకర్లు వెళ్తుంటాయి. దీంతో ప్రపంచ దేశాల్లో గ్యాస్, చమురు సంక్షోభం తలెత్తింది. ఈ పరిస్థితులను చక్కదిద్దేందుకు తాజాగా ఐరోపా, జపాన్ చేతులు కలిపాయి. ఈ ప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తాయో వేచి చూడాలి.
ఇది కూడా చదవండి: Netanyahu: ఇరాన్ అణుశక్తిని నాశనం చేశాం.. పుకార్ల మధ్య నెతన్యాహు ప్రెస్‌మీట్