US-Iran War: ప్రభుత్వం vs మిలిటరీ.. హార్ముజ్ అంశంపై ఇరాన్‌లో అంతర్గత విభేదాలు..

  • హోర్ముజ్ అంశంపై ఇరాన్‌లో అంతర్గత విభేదాలు.
  • IRGC కఠిన వైఖరి.. అమెరికాపై ఒత్తిడి కొనసాగించాలని పట్టుదల.
  • చర్చల ద్వారా పరిష్కారం కోరుతున్న పెజెష్కియన్ ప్రభుత్వం.
Iran War (1)

Iran War (1)

US-Iran War: అమెరికా, ఇరాన్ మధ్య మళ్లీ యుద్ధం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో హార్ముజ్ జలసంధి విషయంలో ఇప్పుడు ఇరాన్‌లో అంతర్గత విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC)కి, ఎన్నికైన ప్రజా ప్రభుత్వానికి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరినట్లు నివేదికలు చెబుతున్నాయి. IRGCకి చెందిన కఠిన వైఖరి గల కమాండర్లు, హోర్ముజ్ జలసంధిపై తమ నియంత్రణను ఏ విధంగానైనా కాపాడుకోవాలని, అమెరికాకు వ్యతిరేకంగా పోరాటాన్ని కొనసాగించాలని కోరుకుంటుండగా, అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ నేతృత్వంలోని ఇరాన్ ప్రభుత్వం ఈ సంక్షోభాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నాయి.

సౌఫాన్ సెంటర్‌లోని సీనియర్ విశ్లేషకుడైన కెన్నెత్ కాట్జ్‌మాన్ ప్రకారం, ప్రస్తుతం ఇరాన్‌లో రెండు విభిన్న ఆలోచనలు పనిచేస్తు్నాయని, హార్ముజ్‌పై నియంత్రణ కోసం ఐఆర్‌జీసీ కమాండర్లు కఠినంగా ఉన్నారని చెప్పారు. దీంతో పాటు తమ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ హత్యకు ప్రతీకారం తీర్చుకోవాలని కోరుకుంటోంది. భవిష్యత్తులో అమెరికా ఇరాన్‌పై దాడి చేయకుండా ప్రతీకారం ఇవ్వాలని ఇరాన్ మిలిటరీ భావిస్తోంది.

అంతర్గత విభేదాలు:

అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్, పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాకర్ ఘాలిబాఫ్ వంటి నాయకులు యుద్ధాన్ని తీవ్రతరం చేయడం కన్నా చర్చలకు వెళ్లడం బెటర్ అని భావిస్తున్నారు. ఒమన్ మధ్యవర్తిత్వంతో అమెరికా, ఇరాన్ మధ్య చర్చలు మళ్లీ ప్రారంభించి, హార్ముజ్‌పై ఒక ఒప్పందానికి రావాలని ఇరాన్‌లో ఎన్నికైన ప్రభుత్వం కోరుకుంటోందని విశ్లేషకులు చెబుతున్నారు.

ప్రపంచంలో 20 శాతం ఇంధన ఎగుమతులు జరిగే హార్ముజ్‌లో స్వేచ్ఛాయుత నౌకాయానం ఉండాలని అమెరికా భావిస్తోంది. అయితే, హార్ముజ్ కంట్రోల్ తమదే అని ఇరాన్ చెబుతోంది. ఈ నేపథ్యంలో మళ్లీ ఉద్రిక్తతలు పెరిగాయి. ఒక వేళ హార్ముజ్ జలసంధిని మూసేస్తే ఇరాన్‌పై అమెరికా మరిన్ని దాడులు చేసే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఒక వేళ ప్రభుత్వం, మిలిటరీపై ఒత్తిడి తీసుకువస్తే, ఒమన్ మధ్యవర్తిత్వంతో కొత్త ఒప్పందం కుదిరే అవకాశం ఉంది.