Strait of Hormuz : హార్ముజ్ జలసంధిలో భారత నౌకలకు ఇరాన్ గ్రీన్ సిగ్నల్..

  • భారత నౌకలకు రాకపోకల్లో ఆంక్షల నుంచి మినహాయింపు
  • ఔషధాల దిగుమతుల కోసమే ఈ వెసులుబాటు: ఇరాన్ ప్రతినిధి
  • చైనా, ఇరాక్, ఖతార్ నౌకలకూ గ్రీన్ సిగ్నల్
  • అమెరికాతో మళ్లీ యుద్ధం జరిగే అవకాశాలపై ఇరాన్‌లో ఆందోళన
Strait Of Hormuz

Strait Of Hormuz

కీలకమైన హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) గుండా ప్రయాణించే వాణిజ్య నౌకలపై విధించిన ఆంక్షల నుంచి భారతదేశానికి ఇరాన్ సడలింపు ఇచ్చింది. భారత్‌తో పాటు చైనా, ఇరాక్, ఖతార్ దేశాలకు చెందిన నౌకలకు కూడా ఈ మినహాయింపులు వర్తిస్తాయని ఇరాన్ పార్లమెంటరీ కమిటీ స్పష్టం చేసింది. ఈ నాలుగు దేశాల నౌకల రాకపోకలపై ఎలాంటి ఆంక్షలు ఉండవని, అమెరికా కూడా వీరితో ఎలాంటి సమస్య సృష్టించదని ఇరాన్ వెల్లడించింది.

ఔషధాల దిగుమతి కోసమే భారత్‌కు మినహాయింపు

ఇరాన్ జాతీయ భద్రత, విదేశాంగ విధాన పార్లమెంటరీ కమిటీ వైస్ ఛైర్మన్ అహ్మద్ హయత్-మొగద్దమ్ ఒక సమీక్షా సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. హార్ముజ్ జలసంధి గుండా రాకపోకల విషయంలో తమ వైఖరి స్పష్టంగా ఉందని, నాలుగు దేశాలకు మినహాయింపు ఇచ్చినట్లు ఆయన తెలిపారు. భారతదేశం నుంచి అవసరమైన మందులు (ఆషధాలు) దిగుమతి చేసుకోవడానికి వీలుగా భారత నౌకలకు ఈ సడలింపు ఇచ్చామని ఆయన పేర్కొన్నారు. అలాగే రాజకీయోపకారాలు, దౌత్యపరమైన మద్దతును దృష్టిలో ఉంచుకుని చైనాకు సడలింపు కల్పించినట్లు చెప్పారు.

అమెరికాతో యుద్ధ మేఘాలు.. ఇరాన్ అంతర్గత అంచనాలు

మరొకవైపు, అమెరికాతో నేరుగా యుద్ధం మళ్లీ ప్రారంభమయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని ఇరాన్ అంతర్గత అంచనాలు సూచిస్తున్నట్లు అంతర్జాతీయ వార్తా సంస్థ ‘అల్ అరేబియా’ నివేదించింది. శాంతియుత దౌత్య మార్గాల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని దేశంలోని అగ్రశ్రేణి నిపుణులు నిరంతరం విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ, సైనిక వ్యూహకర్తలు మాత్రం శాంతి స్థాపనపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఖతార్ శాంతి ప్రతిపాదనపై చర్చలు

ప్రస్తుత ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఖతార్ ఒక శాంతి ప్రతిపాదనను తెచ్చిన సంగతి తెలిసిందే. ఈ ప్రతిపాదనను సానుకూలంగా పరిశీలించాలని, అమెరికాతో ఘర్షణను నివారించేందుకు సైన్యంతో కలిసి నిర్మాణాత్మకంగా చర్చలు జరపాలని ఇరాన్ అగ్ర రాజకీయ నాయకత్వం తమ సైన్యానికి సూచించింది. ఖతార్ నుంచి ప్రత్యేక రాయబారులు ఇటీవల కఠినమైన ఆదేశాలతో టెహ్రాన్‌ను సందర్శించిన వేళ, ఇటు దౌత్య ప్రయత్నాలు.. అటు సైనిక ప్రణాళికలు సమాంతరంగా సాగుతున్నాయి.