China-Bangladesh: చైనా నుంచి బంగ్లాదేశ్‌కు క్షిపణి ఇంధన రసాయనం? పట్టుకున్న ఇండోనేషియా నేవీ!

  • చైనా నుంచి బంగ్లాదేశ్‌కు క్షిపణి తయారీ సరకు..
  • పట్టుకున్న ఇండోనేషియా నేవీ..
Indonesia

Indonesia

China-Bangladesh: చైనా నుంచి బంగ్లాదేశ్ వెళ్తున్న ఓ నైకను ఇండోనేషియా నేవీ సీజ్ చేసింది. అనుమానాస్పదంగా ఉన్న ఈ నౌకలో రాకెట్లు, క్షిపణులు, ప్రొపెల్లెంట్‌ తయారీలో వాడే 405 టన్నుల సోడియం పర్‌క్లోరేట్ రసాయనాన్ని గుర్తించారు. రిజస్ట్రేషన్ లేని లక్షలాది సిమ్ కార్డుల్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ సరకు బంగ్లాదేశ్‌కు ఎందుకు తరలిస్తున్నారు? ఎవరికి అందించాలని భావిస్తున్నారు? అనే దానిపై ఇప్పుడు విచారణ జరుగుతోంది.

అనుమానాస్పదంగా నౌక..

కొమొరోస్ దేశ జెండాతో ప్రయాణిస్తున్న MV స్టార్ లైన్స్ అనే నౌక చైనాలోని లియాన్యుంగాంగ్ పోర్టు నుంచి బంగ్లాదేశ్‌లోని మోంగ్లా పోర్టుకు వెళ్తోంది. నవంబర్ 7న ఇండోనేషియాలోని ఉత్తర సుమత్రా ప్రాంతంలో బెలావన్ సమీపంలో ఆ నౌకను నేవీ అడ్డుకుంది. బెలావల్ సముద్ర ప్రాంతంలో ముందుగా నిర్ణయించిన ప్లాన్‌లో లేని ఒక నౌక ఆగినట్లు ఇండోనేషియా నేవీ గుర్తించింది. రేడియో ద్వారా సంప్రదించేందుకు ప్రయత్నించినప్పటికీ నౌక సిబ్బంది నుంచి స్పందన రాలేదు. ప్రయాణ సమయంలో నౌకలోని ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ (AIS)ను కూడా నిలిపివేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. నౌకలోని 36 కంటైనర్లను తనిఖీ చేయగా.. వాటిలో 15 కంటైనర్లలో 405 టన్నుల సోడియం పర్‌క్లోరేట్ లభించింది.

నౌకలో లభించిన సోడియం పర్‌క్లోరేట్‌ను రాకెట్లు, క్షిపణుల్లో ఘన ఇంధన ప్రొపెల్లెంట్‌గా వాడుతారు. స్వాధీనం చేసుకున్న ఈ రసాయనిక పదార్థంలో సుమారు 100 క్షిపణులు తయారు చేయొచ్చని అంచనా వేస్తున్నారు. ఇదే నౌకలోని 54 ప్యాలెట్లలో లక్షలాది ఖాళీ 4G LTE సిమ్ కార్డులు కూడా లభించాయి.

బంగ్లాదేశ్‌కు ఎందుకు తీసుకెళ్తున్నారు..?

బంగ్లాదేశ్‌లో మందుగుండు సామాగ్రి, తేలికపాటి ఆయుధాల తయారీకి సంబంధించిన రక్షణ పరిశ్రమలు ఉన్నప్పటికీ, క్షిపణులు-రాకెట్ తయారీ మౌలిక సదుపాయాలు అక్కడ లేవు. అయినప్పటికీ ఇంత భారీ మొత్తంలో ఈ రసాయనాన్ని ఎందుకు తరలిస్తున్నారనే దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బంగ్లాదేశ్‌లో ఈ సరకు ఎవరికి చేరుతుందనే వివరాలపై ఇండోనేషియా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.