India’s Trusted Allies: అంతర్జాతీయ వేదికపై సంక్షోభాలు వచ్చినప్పుడు భారతదేశానికి వెన్నుదన్నుగా నిలిచే నిజమైన మిత్రదేశాలు ఏవి? ఈ ప్రశ్నకు దేశంలోని అత్యధిక జనాభా ఇచ్చిన సమాధానాలు ఇప్పుడు సోషల్ మీడియా, విశ్లేషకుల వర్గాల్లో తెగ వైరల్ అవుతున్నాయి. న్యూఢిల్లీలోని ‘ఇండియా-ఇజ్రాయెల్ సెంటర్’ నిర్వహించిన తాజా అధ్యయనంలో.. భారతీయుల నమ్మకాన్ని గెలుచుకోవడంలో రష్యా, ఇజ్రాయెల్‌లు అగ్రస్థానాల్లో నిలిచాయి. ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ వంటి ఐదు కీలక రాష్ట్రాల్లోని దాదాపు 42 కోట్ల జనాభాకు ప్రాతినిధ్యం వహిస్తూ 21 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్కులపై ఈ సర్వే నిర్వహించారు.
సంక్షోభ సమయాల్లో భారత్‌కు అండగా నిలిచే దేశాల్లో రష్యా తిరుగులేని మొదటి స్థానంలో నిలవగా, 57% మంది మద్దతుతో ఇజ్రాయెల్ రెండో స్థానాన్ని దక్కించుకుంది. మొత్తం 62% మంది యువత ఇజ్రాయెల్‌ను భారత్‌కు అత్యంత మంచి మిత్రదేశంగా గుర్తించారు. దేశ ప్రజల నమ్మకం విషయంలో రష్యా, జపాన్‌లు తొలి రెండు స్థానాల్లో ఉండగా, 57% మంది విశ్వాసంతో ఇజ్రాయెల్ మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ రేసులో అమెరికా, ఫ్రాన్స్, యూఏఈ, సింగపూర్ వంటి దేశాలు ఇజ్రాయెల్ కంటే చాలా వెనుకబడిపోవడం గమనార్హం.
ఇజ్రాయెల్‌పై ఇంతటి సానుకూలత ఏర్పడటానికి రక్షణ, వ్యవసాయ రంగాల్లో రెండు దేశాల మధ్య ఉన్న పటిష్టమైన సహకారమే ప్రధాన కారణమని సర్వే తేల్చింది. ఈ సర్వేలో పాల్గొన్న వారిలో 61% మంది రక్షణ, ఆధునిక సాంకేతిక రంగాలలో ఇజ్రాయెల్ సహకారం భారత్‌కు ఎంతగానో మేలు చేస్తుందని తెలిపారు. వ్యవసాయ రంగంలో ఇజ్రాయెల్ తోడ్పాటుతో దేశవ్యాప్తంగా 35 సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్‌లు ఏర్పాటయ్యాయి. వీటిలో నాలుగు కేంద్రాలు యూపీలోని బస్తీ, కనౌజ్, అలాగే బీహార్‌లోని వైశాలి, నలందలలో ఉన్నాయి. ఇక్కడ రైతులకు డ్రిప్ ఇరిగేషన్, అధునాతన సాగు పద్ధతుల్లో శిక్షణ ఇస్తున్నారు. ముఖ్యంగా యూపీలోని గోరఖ్‌పూర్ (91%), వారణాసి (88%) నగరాల్లో అత్యధిక శాతం మంది ఇజ్రాయెల్‌ను బలంగా విశ్వసిస్తున్నట్లు చెప్పారు. స్థానిక వ్యవసాయ సహకారంతో పాటు ఇజ్రాయెల్‌లో భారతీయులకు లభిస్తున్న ఉపాధి అవకాశాలు ఈ నమ్మకాన్ని భారీగా పెంచాయి. ద్వైపాక్షిక వాణిజ్యం క్రమంగా పెరుగుతుండటం, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల దిశగా అడుగులు పడుతుండటంతో.. సర్వేలో పాల్గొన్న వారిలో 50 శాతం మంది భారత్-ఇజ్రాయెల్ బంధం భవిష్యత్తులో మరింత బలపడాలని కోరుకుంటున్నారు. గ్లోబల్ పాలిటిక్స్‌లో ఎన్నో దేశాలు ఉన్నప్పటికీ, భారతీయుల దృష్టిలో నిజమైన మిత్రులంటే రష్యా, ఇజ్రాయెల్‌లేనని ఈ సర్వే రిపోర్ట్ తేల్చిచెప్పింది.

