Site icon NTV Telugu

Ukraine Russia War: భారత్‌పై బైడెన్‌ కీలక వ్యాఖ్యలు

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కొనసాగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు బైడెన్.. భారత్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. వాషింగ్టన్‌లో బిజినెస్ లీడర్ల సమావేశంలో మాట్లాడిన బైడెన్‌.. రష్యాకు వ్యతిరేకంగా కూటమి కట్టే విషయంలో భారత్‌ తీసుకునే నిర్ణయాల్లో అస్థిరత కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. పాశ్చాత్య దేశాల తరహాలో భారత్.. రష్యాపై కఠిన ఆంక్షలు, నిషేధాజ్ఞలను జారీ చేయలేకపోతోందని, వణుకుతోందని అన్నారు. రష్యా వ్యతిరేక కూటమిలో భారత్‌ను మినహాయించినట్టేనని పేర్కొన్నారు. స్థిరమైన నిర్ణయాలు, అభిప్రాయాలు భారత్‌లో కనిపించట్లేదని చెప్పారు. క్వాడ్‌లో సభ్యత్వం ఉన్న దేశాలు రష్యా వ్యతిరేక కూటమిలో చేరడం.. భారత్ ఇందుకు అంగీకరించకపోవడాన్ని జో బైడెన్ బాహటంగానే తప్పుపట్టారు. రష్యా నుంచి క్రూడాయిల్‌ను కొనడాన్ని కూడా పరోక్షంగా వ్యతిరేకించారు. భారత వైఖరిపై ఆయన స్పందించడం ఇదే తొలిసారి. క్వాడ్‌లో ఉన్న దేశాల్లో భారత్‌ను మినహాయించినట్టేనని వ్యాఖ్యానించారు. రష్యాకు వ్యతిరేకంగా వ్యవహరించడంలో జపాన్ తమ అంచనాలకు అనుగుణంగా, బలంగా పని చేస్తోందని చెప్పారు. ఆస్ట్రేలియా ఇప్పటికే పలు ఆంక్షలను విధించిందని గుర్తుచేశారు.

Read Also: Gang Rape: దారుణం.. వైద్యురాలిపై సామూహిక అత్యాచారం

అయితే, తమకు ఎదురుతిరిగే విషయంలో నాటో చీలిపోతుందంటూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చేసిన వ్యాఖ్యలను కూడా జో బైడెన్ తప్పు పట్టారు. చరిత్రలో ఎప్పుడూ లేనంతగా నాటో సభ్య దేశాలు ఐక్యంగా ఉన్నాయని చెప్పారు. ఉమ్మడిగా రష్యాను వ్యతిరేకిస్తోన్నాయని తేల్చిచెప్పారు. నాటో చీలిపోతుందంటూ చేసిన వ్యాఖ్యలు వాస్తవానికి విరుద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఐక్యంగా రష్యాను ఎదుర్కొంటున్నాయని, యుద్ధాన్ని ఆపేంత వరకూ ఇది కొనసాగుతుందని చెప్పారు జో బైడెన్. ఇక, భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా.. క్వాడ్‌లో సభ్యత్వం గల దేశాలు. ఇందులో భారత్ మినహాయిస్తే-మిగిలిన రెండూ రష్యాకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోన్నాయి. జపాన్, ఆస్ట్రేలియా ఇప్పటికే రష్యాపై ఆంక్షలను విధించాయి. ఈ యుద్ధంలో రష్యా వైఖరిని తప్పుపట్టాయి. ఇక మిగిలింది-భారత్. రష్యాతో సుదీర్ఘకాలంగా బలమైన స్నేహ సంబంధాలను కలిగివున్న భారత్.. రష్యాతో వైరం ఏ మాత్రం కోరుకోవట్లేదు. అలాగనీ-యుద్ధాన్ని గానీ, ఈ విషయంలో రష్యాను గానీ సమర్థించట్లేదు. తటస్థంగా ఉంటోంది.

Exit mobile version