Site icon NTV Telugu

India-Srilanka: శ్రీలంకకు ఇండియా ఆపన్నహస్తం.. ఊరటనిచ్చేలా కీలక ఒప్పందం

Srilanka

Srilanka

తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకకు ఆపన్నహస్తం అందించి అండగా నిలుస్తోంది భారత్​. ప్రస్తుత సంక్షోభ సమయంలో భారత్​తో మళ్లీ స్నేహ సంబంధాలకు హస్తం చాచింది కొలంబో. గతంలో కొలంబో పాలకులు భారత్‌ను కాదని ఇతర దేశాలకు దగ్గరయ్యేందుకు యత్నించారు. ప్రత్యేకించి డ్రాగన్‌తో కుదుర్చుకున్న ఒప్పందాలు శ్రీలంకను రుణ ఊబిలోకి నెట్టేశాయి. ప్రస్తుతం దిక్కుతోచని స్థితిలో ఆప్త మిత్రదేశం ఇండియాతో పలు ఒప్పందాలు కుదుర్చుకొంటూ కొలంబో వడిగా అడుగులు వేస్తోంది. భారత్‌ గతంలో వంద కోట్ల డాలర్ల రుణాన్ని ప్రకటించింది.

తాజాగా యూరియా కొనుగోలు కోసం పొరుగు దేశానికి 55 మిలియన్ డాలర్ల మేర క్రెడిట్ లైన్ అందించాలని భారత్ నిర్ణయించింది. అత్యవసరంగా సాయం చేయాలని శ్రీలంక ప్రభుత్వం అర్థించడంతో భారత్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ క్రెడిట్ లైన్‌కు సంబంధించి శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమసింగే, వ్యవసాయ మంత్రి మహీంద్ర అమరవీర, భారత హైకమిషనర్ గోపాల్ బాగ్లే సమక్షంలో శ్రీలంక ప్రభుత్వం, ఎక్స్‌పోర్ట్- ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొలంబోలో శుక్రవారం ఒప్పందంపై సంతకాలు చేశాయి.

శ్రీలంకలో వర్షకాల సీజన్ ప్రారంభమైంది. విత్తనాలు నాటేందుకు సరిపడా యూరియా నిల్వలు కూడా శ్రీలంకలో లేవు. దీంతో అత్యవసర వినియోగానికి 65 వేల టన్నుల యూరియా కొనుగోలు కోసం శ్రీలంక ప్రభుత్వం భారత్‌ను ఆశ్రయించింది. వెంటనే స్పందించిన ఇండియా.. శ్రీలంకకు తక్షణమే రుణం రూపంలో యూరియా పంపేందుకు ముందుకొచ్చింది. రసాయన ఎరువులును దిగుమతి చేసుకోకుండా సేంద్రీయ సాగు వైపు మళ్లాలని గతంలో అధ్యక్షుడు గొటబయ రాజపక్స ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో శ్రీలంకలో పంట దిగుబడులు 50 శాతం తగ్గాయి. ఫలితంగా ఆహార కొరత తలెత్తింది.

సంక్షోభ సమయంలో లంక ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన రణిల్ విక్రమ సింఘే ప్రజలకు ఆహార భద్రత కల్పించడానికి ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. ఆపత్కాలంలో ఆదుకున్న భారత ప్రభుత్వానికి లంక ప్రధాని రణిల్ విక్రమ సింఘే ధన్యవాదాలు తెలిపారు. పొరుగు దేశాలకు ప్రాధాన్యం ఇస్తోన్న భారత్.. చిరకాల మిత్రుడు అయిన శ్రీలంకకు కూడా అనేక విధాలు సాయం అందిస్తోందని శ్రీలంకలోని భారత హైకమిషన్ వెల్లడించింది. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి కనీవిని ఎరగని రీతిలో ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకకు.. భారత్ ఇప్పటి వరకూ దాదాపు 3.5 బిలియన్ డాలర్ల మేర ఆర్థిక సాయం చేసింది.

Exit mobile version