పశ్చిమాసియా యుద్ధం కారణంగా ప్రపంచ దేశాలను చమురు, గ్యాస్ సంక్షోభం వెంటాడుతోంది. తీవ్ర భయాందోళనలు నెలకొన్న తరుణంలో భారతదేశానికి మంచి శుభవార్త అందింది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చితో కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ జరిపిన దౌత్యం చక్కటి ఫలితాన్ని ఇబ్బంది. దీంతో హార్ముజ్ జలసంధి నుంచి భారత్ చమురు ట్యాంకర్లు బయల్దేరేందుకు లైన్ క్లియర్ అయింది. ప్రస్తుతం భారత్ ఆయిల్ ట్యాంకర్లు కదిలేందుకు ఇరాన్ మార్గం సుగమం చేసినట్లుగా గురువారం కేంద్ర వర్గాలు పేర్కొన్నాయి. ఈ పరిణామం భారతీయులకు తీపి కబురుగానే చెప్పొచ్చు.
మధ్యప్రాచ్య యుద్ధం కారణంగా తలెత్తిన చమురు, గ్యాస్ సంక్షోభం నేపథ్యంలో ఇటీవల ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చితో పాటు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్, ఫ్రెంచ్ విదేశాంగ మంత్రి జీన్ నోయెల్ బారోతో కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ఫోన్ కాల్ సంభాషణ చేశారు. ఈ సందర్భంగా తాజా పరిణామాలపై చర్చించారు. అంతర్జాతీయ పెద్దలతో జరిపిన సంభాషణ తాజాగా సత్‌ఫలితాన్ని ఇచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా హార్ముజ్ జలసంధిలో చిక్కుకున్న భారత్ చమురు ట్యాంకర్లు జలసంధిని దాటేందుకు ఇరాన్ మార్గం సుగమం చేసింది. అన్ని విధాలుగా రూట్ క్లియర్ చేసినట్లుగా తాజాగా కేంద్ర వర్గాలు పేర్కొన్నట్లుగా జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
ప్రస్తుతం హార్ముజ్ జలసంధిలో శత్రు దేశాలకు వెళ్లే ఆయిల్ ట్యాంకర్లను ఇరాన్ నిలిపివేసింది. అమెరికా, యూరప్, ఇజ్రాయెల్‌లకు వెళ్లే నౌకలపై కఠినమైన ఆంక్షలు ఉన్నాయి. ఇలాంటి తరుణంలో భారతదేశానికి ఇరాన్ ప్రత్యేక రాయితీని మంజూరు చేసింది. భారత్ ట్యాంకర్లు విడిచి పెట్టేందుకు ఇరాన్ అంగీకరించింది. రష్యా, ఫ్రాన్స్ విదేశాంగ మంత్రులతో జైశంకర్ జరిపిన చర్చల ఫలితంగానే ఇదంతా జరిగినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
