ప్రధాని మోడీ మంగళవారం త్రివిధ దళాలతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పహల్గామ్ ఉగ్ర దాడికి ప్రతీకారంగా ఏం చేయాలన్నదానిపై మేథోమథనం చేశారు. ఈ సందర్భంగా త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇస్తూ భవిష్యత్ కార్యాచరణ రూపొందించాలని ప్రధాని మోడీ మార్గదర్శకం చేశారు. టార్గెట్లు, టైమ్ డిసైడ్ చేయాలని రక్షణ శాఖకు కీలక ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం.
ఇక మోడీ కీలక భేటీ తర్వాత పాకిస్థాన్ అప్రమత్తం అయినట్లు కనిపిస్తోంది. తమకు అందిన విశ్వసనీయ నిఘా సమాచారం ప్రకారం భారతదేశం 36 గంటల్లో పాకిస్థాన్‌పై సైనిక చర్యకు సిద్ధపడుతున్నట్లుగా తెలిసిందని పాకిస్తాన్ సమాచార మంత్రి అత్తౌల్లా తరార్ విలేకర్ల సమావేశంలో వ్యాఖ్యానించారు. 24-36 గంటల్లో భారత సైన్యం ఏదొకటి చేయొచ్చని పేర్కొన్నారు. ఒకవేళ భారత్ అలాంటి చర్యలకే దిగితే ఎదుర్కోవడానికి పాకిస్థాన్ కూడా సిద్ధంగా ఉందని తెలిపారు.
పహల్గామ్ ఘటనపై భారత్ నిరాధారమైన, కల్పితమైన ఆరోపణలు చేస్తోందని చెప్పుకొచ్చారు. తటస్థ విచారణకు సిద్ధమని చెప్పినా కూడా సైనిక చర్యకు సిద్ధపడుతుండడం భావ్యం కాదన్నారు. తాము కూడా ఉగ్రవాద బాధితులమేనని.. అలాంటప్పుడు పారదర్శకమైన మరియు స్వతంత్ర దర్యాప్తునకు భారత్ ఎందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నించారు. పాకిస్థాన్ తన సౌరభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను కాపాడుకోవడానకి దృడ సంకల్పంతో ఉందని.. పెరుగుతున్న ఉద్రిక్తతలను అంతర్జాతీయ సమాజం కూడా గమనించాలని మంత్రి కోరారు.
ఇది కూడా చదవండి: Ram Charan : పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ పాల్గొనేది అప్పుడే..
ఇక ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్ర అవుతున్న వేళ ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ స్పందించారు. ఇరు దేశాధినేతలకు ఫోన్ చేశారు. విదేశాంగ మంత్రి జై శంకర్‌తో ఫోన్‌లో మాట్లాడుతూ.. ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని కోరారు. సామరస్యంగా సమస్యను పరిష్కరించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఇది కూడా చదవండి: Off The Record: పటాన్‌చెరు కాంగ్రెస్‌లో ఆరని మంటలు.. పరిష్కారం కోసం ఇద్దరు సభ్యుల పార్టీ కమిటీ!
పహల్గామ్ ఉగ్ర దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయాలు పాలయ్యారు. అనంతరం పాకిస్థా్న్‌పై భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంది. సింధు జలాలను నిలిపివేసింది. అలాగే పాకిస్థాన్ వీసాలను రద్దు చేసింది. అటారీ సరిహద్దు మూసివేసింది. పాక్ యూట్యూబ్ ఛానళ్లు నిలిపివేసింది. ఇలా ఒక్కొక్కటిగా భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది.
