Site icon NTV Telugu

Srilanka Crisis: సంక్షోభంలో శ్రీలంక.. భారత్ ఆపన్నహస్తం

శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం తీవ్రరూపం దాల్చింది. ఇంధన కొరత, వంట గ్యాస్ కొరత కారణంగా ఆ దేశంలో వేలాది హోటళ్లు మూతపడ్డాయి. దీంతో ప్రజలు అంధకారంతో పాటు ఆకలితో అలమటిస్తున్నారు. ఈ నేపథ్యంలో చాలా మంది పక్క దేశాలకు వలస వెళ్లిపోతున్నారు. ఈ నేపథ్యంలో తీవ్రమైన ఇంధన కొరత ఎదుర్కొంటున్న శ్రీలంకకు భారత్ ఆపన్న హస్తం అందించింది. అత్యవసరంగా 40వేల టన్నుల డీజిల్ పంపించాలని నిర్ణయించింది. ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ దీన్ని రవాణా చేయనుంది. ప్రతి నెల పంపించే ఆయిల్‌కు ఇది అదనపు మొత్తం కావడం విశేషం.

మరోవైపు ఇంధనం కొనుగోలు కోసం శ్రీలంకకు.. భారత్‌కు చెందిన ఎగ్జిమ్ బ్యాంక్ 500 మిలియన్ డాలర్ల రుణాన్ని మంజూరు చేసింది. 500 మిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో సుమారు రూ.3,800 కోట్లు. కాగా శ్రీలంకలో పెట్రోల్ బంకుల వద్ద ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా ఆర్మీని రంగంలోకి దించాలని అధికారులు నిర్ణయించారు. కొందరు పెద్ద ఎత్తున పెట్రోలు కొనుగోలు చేస్తూ వ్యాపారం చేస్తున్నారని.. అందరికీ పెట్రోల్, డీజిల్ అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉందని శ్రీలంక ఇంధనశాఖ మంత్రి గామిని లుకోగే అభిప్రాయపడ్డారు.

Exit mobile version