Bangladesh Violence: బంగ్లాదేశ్‌లో ఇంకా హింస చెలరేగుతూనే ఉంది. షేక్ హసీనా రాజీనామా చేసి, ఇండియాకి పారిపోయివచ్చినప్పటికీ అక్కడ పరిస్థితి చక్కబడటం లేదు. ముఖ్యంగా హసీనాకు చెందిన అవామీ లీడ్ పార్టీ నేతలతో పాటు హిందువులను టార్గెట్ చేస్తున్నారు. అక్కడి పరిస్థితులు నివురుగప్పిన నిప్పులా ఉండటంతో ఢాకాలోని భారత రాయబార కార్యాలయం నుంచి అనవసరమైన సిబ్బందిని, వారి కుటుంబాలను అక్కడ నుంచి ఖాళీ చేయించి, భారత్ తీసుకువచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. కీలకమైన రాయబారులు, ఉద్యోగులు మాత్రమే హైకమిషన్‌లో ఉండనున్నారు. ఢాకాలోని భారత హైకమిషనర్‌తో సహా ప్రిన్సిపల్ అధికారులు తమ పదవుల్లోనే ఉన్నారు.
Read Also: Bithiri Sathi: భగవద్గీతను అవమానించి, సారీ చెప్పమంటే బిత్తిరి సత్తి షాకింగ్ రియాక్షన్?
ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకరాం.. కమర్షియల్ ఫ్లైట్ ద్వారా వీరి తరలింపు జరిగినట్లు తెలుస్తోంది. హైకమిషన్ పనిచేస్తూనే ఉంది. ఈ ప్రాంతంలో అశాంతి మధ్య అవసరమైన కార్యకలాపాలను సిబ్బంది నిర్వహిస్తోంది. రాజధాని ఢాకాలోని హైకమిషన్‌తో పాటు చిట్టగాంగ్, రాజ్‌షాహీ, ఖుల్నా, సిల్హెట్‌లతో సహా అనేక ఇతర నగరాల్లో భారతదేశ సహాయక హైకమిషన్లు, కాన్సులేట్స్ ఉన్నాయి. బుధవారం ప్రత్యేక ఎయిర్ ఇండియా విమానం, ప్రయాణికులు లేకుండా ఢిల్లీ నుండి బయలుదేరి, ఢాకా నుంచి 199 మంది పెద్దలు , ఆరుగురు శిశువులతో ఢిల్లీ తిరిగి వచ్చింది.
రిజర్వేషన్ కోటాపై మొదలైన విద్యార్థి ఉద్యమం తీవ్ర హింసాత్మక ఘటనలకు దారి తీసింది. చివరకు ప్రధాని షేక్ హసీనాకు ఆ దేశ ఆర్మీ కేవలం 45 నిమిషాల అల్టిమేటం ఇవ్వడంతో ఆమె రాజీనామా చేసి, ఇండియాకు వచ్చింది. ప్రస్తుతం ఢిల్లీకి సమీపంలోని హిండన్ ఎయిర్‌బేస్‌లో భారత భద్రతా పర్యవేక్షణలో ఉన్నారు. దేశవ్యాప్తంగా హింసాత్మక ఘటనలు చెలరేగడంతో 300కి పైగా ప్రజలు మరణించారు. హసీనా రాజీనామా తర్వాత ఆర్మీ దేశాన్ని అదుపులోకి తీసుకుంది. బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్, జనరల్ వాకర్-ఉజ్-జమాన్ మిలటరీ తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ప్రకటించారు. బంగ్లాదేశ్ మిలిటరీ ఢాకా దౌత్య పరిసర ప్రాంతాలను కాపాడే బాధ్యతను స్వీకరించింది. ఇంతకుముందు ఈ ప్రాంతాన్ని పోలీసులు పర్యవేక్షించే వారు.