NTV Telugu Site icon

IMF: 2023 ప్రపంచవృద్ధిలో సగం వాటా భారత్, చైనాలదే..

India

India

IMF: ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది 3 శాతం కన్నా తక్కువ వృద్ధిని సాధిస్తుందని, 2023లో ప్రపంచవృద్ధిలో భారత్, చైనాల వాటానే సగం ఉంటుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్) చీఫ్ గురువారం తెలిపారు. ఐఎంఎఫ్ మేనేజింగ్ డైెరెక్టర్ క్రిస్టాలినా జార్జివా మాట్లాడుతూ.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధ పరిణామాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్రం ప్రభావం చూపించాయని, దీంతో పాటు కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్ర మందగమనంలో ఉందని ఆమె హెచ్చరించారు.

Read Also: Jai SriRam : అయోధ్య రాముడికి 155 దేశాల నదుల నీటితో మహా జలాభిషేకం

1990 తర్వాత అత్యల్ప వృద్ధి అంచనా ఇదే. గత రెండు దశాబ్ధాల నుంచి సగటున 3.8 కంటే తక్కువగా ఈ ఏడాది వృద్ధి నమోదు అయ్యే అవకాశం ఉందని ఐఎంఎఫ్ అంచనా వేసింది. రానున్న ఐదేళ్లలో ఆర్థిక మందగమనం ఉంటుందని, 3 శాతం కన్నా తక్కువ వృద్ధి నమోదుయ్యే అవకాశాలు ఉన్నాయని ఆమె అన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆసియా దేశాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఆశాకిరణంగా కనిపిస్తున్నాయని, అభివృద్ధి చెందుతున్న దేశాలు ఆర్థిక వ్యవస్థ ఊపందుకుందని తెలిపారు. 2023 లో భారతదేశం, చైనా ప్రపంచ ఆర్థిక వృద్ధిలో సగం వాటాను కలిగి ఉంటాయని అన్నారు.

2021 మహమ్మారి నుంచి కోలుకుంటున్న సమయంలో ఉక్రెయిన్-రష్యా యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తలకిందులుగా చేసిందని, ప్రపంచ వృద్ధి 6.1 శాతం నుంచి 3.4 శాతానికి పడిపోయిందని ఆమె వెల్లడించారు. తక్కువ ఆదాయ దేశాలకు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవచ్చని, పేదరికం, ఆకలి మరింత పెరగవచ్చని జార్జివా వివరించారు. 90 శాతం అడ్వాన్స్‌డ్ ఎకానమీలు కలిగిన దేశాలు తమ వృద్ధి రేటులో క్షీణతను చూస్తాయని అన్నారు. ప్రపంచ దేశాలతో పోలిస్తే కేవలం భారత్ మాత్రమే ఈ ఏడాది 6 శాతం కన్నా ఎక్కువ వృద్ధిరేటు నమోదు చేస్తుందని ఇటీవల ఐఎంఎఫ్ ప్రకటించింది. ఇటీవల ప్రపంచ బ్యాంకు కూడా ఈ ఏడాది భారత్ వృద్ధిరేటు 6.3 శాతంగా ఉంటుందని అంచనా వేసింది.