PM Shahbaz Sharif: ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ తర్వాత పాకిస్తాన్ లో తీవ్ర ఆందోళనలు జరిగాయి. రాజధాని ఇస్లామాబాద్ తో పాటు కరాచీ, లాహోర్, పెషావర్ నగరాల్లో ఆయన మద్దతుదారులు విధ్వంసం సృష్టించారు. ఆర్మీ కంటోన్మెంట్లు, ప్రభుత్వ ఆస్తులే లక్ష్యంగా దాడులు చేశారు. అయితే ఈ విధ్వంసంపై పాక్ ప్రధాని షహజాబ్ షరీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇమ్రాన్ ఖాన్ మరియు అతని మద్దతుదారులు “ఉగ్రవాదుల కంటే తక్కువ కాదు” అని అన్నారు. ప్రభుత్వం ఆస్తులు, ఆర్మీ అధికారులు నివాసాలపై దాడులు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Read Also: Bandi Sanjay : దేశంలో ఒక రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు ఇవి.. ఆ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు వేరు
దశాబ్ధాలుగా బయట నుంచి శతృవులు కూడా చేయలేని విధ్వంసాన్ని ఇమ్రాన్ ఖాన్ అతని మద్దతుదారులు చేశారని ఆరోపించారు. దాడులకు తెగబడిన వారంతా చట్టం, రాజ్యాంగ ప్రకారం శిక్షించబడతారని హెచ్చరించారు. నిందితులను గుర్తించేందుకు పంజాబ్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రికి, అధికారులకు 72 గంటల డెడ్ లైన్ విధించారు.
ఇటీవల ‘అల్ ఖదీర్ ట్రస్ట్’ అవినీతి కేసులో ఇమ్రాన్ ఖాన్ ను ‘నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో’ అరెస్ట్ చేసింది. అయితే ఈ వ్యవహారంపై అక్కడి సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇమ్రాన్ ఖాన్ ను వెంటనే విడుదల చేయాలని ఆదేశించడంతో ఆయన అరెస్ట్ నుంచి విడుదలయ్యారు. విడుదల తర్వాత ఇస్లామాబాద్ నుంచి లాహోర్ చేరుకున్న ఆయనకు అభిమానులు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు.
