Imran Khan: రావల్పిండిలోని అదియాలా జైల్లో బందీగా ఉన్న పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తన న్యాయవాదుల ముందు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తన బెయిల్, వ్యక్తిగత కేసులను కాసేపు పక్కన పెట్టి.. అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్య బుష్రా బీబీని రక్షించడంపైనే పూర్తి దృష్టి సారించాలని లీగల్ టీమ్‌కు తేల్చి చెప్పారు. పీటీఐ (పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్) సీనియర్ నేత, ప్రముఖ న్యాయవాది బారిస్టర్ గౌహర్ అలీ ఖాన్ జైలుకు వెళ్లి ఇమ్రాన్‌తో సమావేశమైన సందర్భంగా ఈ కీలక పరిణామం చోటుచేసుకుంది. 2023 నుంచి వేర్వేరు కేసుల్లో జైలు జీవితం గడుపుతున్న ఇమ్రాన్ ఖాన్, బుష్రా బీబీలను ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఇబ్బందులకు గురిచేస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా బుష్రా బీబీ గత కొంతకాలంగా తీవ్ర కంటి సమస్యలతో పాటు ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆమెకు తక్షణమే మెరుగైన వైద్యం అందించకపోతే ఆరోగ్యం మరింత విషమించే ప్రమాదం ఉందని ఇమ్రాన్ వాపోయారు. జైలు అధికారులు, ప్రభుత్వం ఆమె చికిత్సపై ఏమాత్రం శ్రద్ధ చూపడం లేదని ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
లాయర్లతో భేటీ సందర్భంగా ఇమ్రాన్ ఖాన్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. “ప్రస్తుతం నా కేసుల గురించి ఆలోచించవద్దు.. లాయర్లంతా తక్షణమే కోర్టుకు వెళ్లి బుష్రా బీబీకి రిలీఫ్ లభించేలా పిటిషన్లు వేయండి. ఆమెను బయటకు తీసుకొచ్చి సరైన చికిత్స అందేలా చేయడమే మన మొదటి ప్రాధాన్యతకావాలి” అని కోరారు. భార్యను కనీసం చూసేందుకు కూడా అధికారులు అనుమతించడం లేదని గతంలోనే కోర్టును ఆశ్రయించిన ఇమ్రాన్.. తాజా పరిస్థితులపై మరింత కలత చెందారు. ఓవైపు భార్య ఆరోగ్యంపై ఆందోళన చెందుతూనే.. రాజకీయంగా తాను ఎవరికీ తలవంచేది లేదని ఇమ్రాన్ ఖాన్ స్పష్టం చేశారు. జైల్లో ఉన్నప్పటికీ బయట జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలు, ఖైబర్ పఖ్తుంఖ్వాలో విధించిన అత్యవసర పరిస్థితి వంటి అంశాలన్నీ తనకు తెలుసని పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్బంధాలకు భయపడకుండా పార్టీ నేతలు, కార్యకర్తలంతా ఏకతాటిపై నిలిచి పోరాటం కొనసాగించాలని సందేశం పంపారు. ప్రస్తుతం వీరిద్దరినీ అదియాలా జైలు నుంచి ఇస్లామాబాద్ జైలుకు తరలించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్న వేళ.. ఇమ్రాన్ ఖాన్ చేసిన ఈ భావోద్వేగ వ్యాఖ్యలు పాక్ రాజకీయాల్లో తీవ్ర సంచలనంగా మారాయి.

