కరోనా మహమ్మారి మలేషియా దేశంలో విలయ తాండవం చేస్తోంది. అక్కడ నిన్న ఒక్కరోజు 10 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. మలేషియా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం.. గురువారం అర్ధరాత్రి నాటికి మలేషియాలో 10,413 కొత్త కోవిడ్ ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటివరకు కోవిడ్ బాధితుల సంఖ్యం 43,63,024కు చేరుకుంది. అయితే వీటిలో విదేశాల నుంచి వచ్చిన వారు 27 మంది ఉండగా, స్వదేశంలో 10,386 మందికి ఈ కరోనా సోకినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అంతేకాకుండా మరో 18 మరణాలు నమోదయ్యాయి. దీంతో మరణాల సంఖ్య 35,381కి చేరుకుంది.
వీటితో పాటు 13,202 మంది గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి కోలుకోగా, ఇప్పటివరకు డిశార్చ్ అయినవారి సంఖ్య 4,209,858గా ఉంది. ప్రస్తుతం మలేషియా దేశ వ్యాప్తంగా 1,17,785 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 154 మంది ఇంటెన్సివ్ కేర్‌లో ఉండగా, వారిలో 89 మందికి సహాయక శ్వాస అవసరం ఉంది. అయితే రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండడంతో అక్కడ కోవిడ్ నిబంధనలు కఠినతరం చేశారు. చైనాలో సైతం ఒమిక్రాన్ వేరియంట్ ఎల్452ఆర్ మ్యుటేషన్ వ్యాప్తి చెందుతుండడంలో, శాంఘై సిటీలో లాక్‌డౌన్ విధించారు. దీంతో శాంఘై నగరంలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.