HP plans to layoff 12 per cent of its global workforce over the next few years: కంప్యూటర్ హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్, ఐటీ సర్వీసులను అందించే ప్రముఖ కంపెనీ హెచ్‌పీ త్వరలోనే తమ ఉద్యోగులకు ఉద్వాసన పలికే పనిలో ఉందని తెలుస్తోంది. హెచ్‌పీ 2025 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఉద్యోగులను తగ్గించాలని యోచిస్తోంది. అన్ని ప్రముఖ ఐటీ కంపెనీలు చెబుతున్నట్లే హెచ్‌పీ కూడా నిర్వహణ ఖర్చులు తగ్గించుకోవడానికి కఠిన నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ట్విట్టర్, మెటా, అమెజాన్, గూగుల్ దారిలో హెచ్‌పీ కూడా చేరింది. కంపెనీలో దాదాపుగా 12 శాతం అంటే 6,000 మందిని తొలగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కంప్యూటర్ల విక్రయాలు క్రమంగా తగ్గుతున్న సమయంలో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ మేరీ మైయర్స్ నుంచి ఈ ప్రకటన వెలువడింది.
Read Also: Uttar Pradesh: మేము అధికారంలోకి వస్తే “మీరట్” పేరును “నాథూరామ్ గాడ్సే నగర్”గా మారుస్తాం.
2022లో అనేక సవాళ్లు 2023 ఆర్థిక సంవత్సరంలో కూడా కొనసాగుతున్నాయిన మైయర్స్ అన్నారు. కంపెనీలో ప్రస్తుతం 50,000 మంది పనిచేస్తున్నారు. వీరిలో 4000 నుంచి 6000 మంది ఉద్యోగాల ఊడుతాయని తెలుస్తోంది. తొలగింపు వల్ల ఏఏ విభాగాలు ప్రభావితం అవుతాయో ఇప్పటి వరకు అస్పష్టంగానే ఉంది. 2022 క్యూ3 ఫలితాల్లో పీసీ అమ్మకాలు 15.5 శాతం పడిపోయాయి. 2021 క్యూ3లో 17.3 మిలియన్ యూనిట్ల పీసీలను రవాణా చేసింది హెచ్‌పీ. ఈ ఏడాది అది 12.7 మిలియన్ యూనిట్లకు పడిపోయింది.
ఇదిలా ఉంటే ఆర్థిక మాంద్యం, ద్రవ్యోల్భణం ఇలా పలు దేశాల ఆర్థిక పరిస్థితులు టెక్ కంపెనీలను భయపెడుతున్నాయి. దీంతో ఖర్చులను తగ్గించుకోవాలనే ఉద్దేశంతో ట్విట్టర్ ఇప్పటికే 50 శాతం మంది అంటే 3800 మందిని, అమెజాన్ 10,000 మందిని, ఫేస్ బుక్ మాతృసంస్థ మెటా 11,000 మందిని తొలగిస్తున్నామని ప్రకటించాయి. గూగుల్ కూడా తమ ఉద్యోగుల్లో 10,000 మందిని తొలగించాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇదే బాటలో స్ట్రీమింగ్ దిగ్గజాలు అయిన నెట్ ఫ్లిక్స్, డిస్నీలు కూడా నడుస్తున్నాయి. ఆర్థిక నిపుణుల అంచనా ప్రకారం మరో 6-12 నెలల్లో ఆర్థిక మాంద్యం తప్పదని హెచ్చరిస్తున్నారు.