NTV Telugu Site icon

kidnapping: టర్కీ నుంచి కంబోడియా వరకు.. డబ్బు కోసం భారతీయులను కిడ్నాప్ చేస్తున్న పాకిస్తానీలు..

Kidnapping 2

Kidnapping 2

kidnapping: విదేశాల్లో భారతీయులే టార్గెట్‌గా పాకిస్తాన్ జాతీయులు కిడ్నాప్‌కి పాల్పడుతున్నారు. ఆ తర్వాత వారి కుటుంబాలకు ఫోన్ చేసి, విడుదల చేసేందుకు డబ్బును అడుగుతున్నారు. టర్కీ, కంబోడియాల్లో ఇలానే భారతీయులను కిడ్నాప్ చేసి, చివరకు పోలీసులకు చిక్కారు. ఇటీవల టర్కీలో ముగ్గురు పాకిస్తానీ శరణార్థులు భారత వ్యక్తిని కిడ్నాప్ చేసి, రూ. 20 లక్షలు డిమాండ్ చేశారు. ఇక కంబోడియాలో ఇద్దరు పాకిస్తానీయులు, ఇద్దరు భారతీయులను కిడ్నాప్ చేసి మూడు వారాల పాటు బందీలుగా ఉంచారు. ఈ రెండు కేసుల్లో ప్రమేయం ఉన్న పాకిస్తాన్ వ్యక్తుల్ని ఆయా దేశాల పోలీసులు అరెస్ట్ చేశారు.

టర్కీలోని ఎడిర్నే నగరంలో భారతీయుడిని కిడ్నాప్ చేసిన ఆరోపణలపై ముగ్గురు పాకిస్తానీయులను అరెస్ట్ చేసినట్లు టర్కీ పోలీసులు ఆదివారం తెలిపారు. ఇస్తాంబుల్‌లోని ఓ రెస్టారెంట్‌లో చెఫ్‌గా పనిచేస్తున్న రాధాకృష్ణన్‌ని పథకం ప్రకారం ఎడ్రిన్‌కి రప్పించి కిడ్నాప్ చేశారు. అతని కుటుంబం నుంచి రూ.20 లక్షల విమోచన ధనం డిమాండ్ చేశారు.

ఇక కంబోడియాలో ఇద్దరు భారతీయ పౌరులను కిడ్నాప్ చేసి మూడు వారాల పాటు నిర్భందించారు. కిడ్నాప్‌కి పాల్పడిన పాకిస్తానీ వ్యక్తులను రాజధాని నమ్ పెన్‌లో అరెస్ట్ చేశారు. ఏప్రిల్ 25న పాకిస్తానీలు మహ్మద్ సాద్, సుదిత్ కుమార్‌లను కిడ్నాప్ చేయగా.. మే 16న పోలీసులు వీరిని విడిపించారు. వీరి కాళ్లు, చేతులు కట్టేసి దారుణంగా కొట్టారు. పాకిస్తానీలు సబ్‌టైన్ బిన్ నాసిర్, సయ్యద్ అలీ హుస్సేన్‌లు ఇండియన్ రెస్టారెంట్ కోసం స్థలాన్ని చూస్తామని చెప్పి బాధితులను రప్పించి కిడ్నాప్ చేశారు. వారి పాస్‌పోర్టులను కూడా ఎత్తుకెళ్లారు. కిడ్నాప్ తర్వాత వారి కుటుంబాల నుంచి 10 వేలు, 20 వేల డాలర్లను డిమాండ్ చేశారు.

Read Also: Calcutta: హైకోర్టు సంచలన నిర్ణయం.. 2010 తర్వాత నాటి ఓబీసీ సర్టిఫికెట్లు రద్దు

విదేశాల్లో కిడ్నాపుల్లో పాకిస్తానీయులు:

భారతీయులనే కాకుండా ఇతర దేశాల వారిని కూడా పాకిస్తాన్ వ్యక్తుల డబ్బు కోసం కిడ్నాప్ చేస్తున్నారు. ఇటీవల పలు దేశాల్లో ఇలాంటి ఘటనలు పెరిగాయి. వీటిలో ఆ దేశస్తుల ప్రమేయం ఎక్కువగా ఉంటోంది. ఏప్రిల్ నెలలో ఉద్యోగాల కోసం యూరప్‌కు పంపుతామని ప్రలోభపెట్టి, నలుగురు శ్రీలంక పౌరులను కిడ్నాప్ చేసినందుకు నలుగురు పాకిస్తాన్ జాతీయులను నేపాల్‌లో అరెస్టు చేశారు. నలుగురు శ్రీలంక పౌరుల నుంచి పాకిస్థానీయులు లక్షలాది రూపాయలు వసూలు చేశారు. నేపాల్ పోలీసుల ఖాట్మండు వ్యాలీ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ డిపార్ట్‌మెంట్ నలుగురు పాకిస్తాన్ జాతీయులను అరెస్టు చేసింది.

2022లో నలుగురు నేపాల్ పౌరులుల్ని ఇస్తాంబుల్‌లో పాకిస్తాన్ ముఠా తుపాకీ చూపించి కిడ్నాప్ చేసింది. తర్వాత వీరిని టర్కీ పోలీసులు విడిపించారు. 2021లో తోటి పాకిస్తానీనే వారు కిడ్నాప్ చేసి విడుదల చేయడానికి 50 వేల యూరోలను డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ నుంచి వచ్చే వారి కోసం టర్కీ వీసా విధానాన్ని కఠినతరం చేసింది. పాకిస్తానీలు తమ దేశానికి రావద్దని ‘పాకిస్తాన్ గెట్ అవుట్’ వంటి హ్యాష్ ట్యాగ్‌లో టర్కీ యువత సోషల్ మీడియాలో ప్రచారం చేసింది.