Houthis Attack Saudi: టర్కీ-పాక్‌తో ఒప్పందం కుదిరిన తర్వాత రోజే.. సౌదీపై హౌతీల భీకర దాడి..

  • సౌదీ అరేబియా అరామ్ కో రిఫైనరీపై హౌతీల దాడి..
  • పాక్, టర్కీలతో ఒప్పందం కుదరిని తర్వాతి రోజే డ్రోన్ అటాక్..
  • ఈ ఒప్పందం సౌదీకి భద్రత ఇవ్వదని కామెంట్ చేసిన ఇరాన్..
Houthis Attack Saudi

Houthis Attack Saudi

Houthis Attack Saudi: మిడిల్ ఈస్ట్‌లో మరోసారి తీవ్ర ఉద్రిక్తతలు పెరిగాయి. సౌదీ అరేబియాలోని అరామ్ కో చమురు కేంద్రంపై ఇరాన్ మద్దతు కలిగిన యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులు దాడికి పాల్పడ్డారు. డ్రోన్‌తో దాడి చేసినట్లు తెలుస్తోంది. జిజాన్ నగరంలోని అరామ్ కో రిఫైనరీని డ్రోన్లతో దాడి చేశామని హౌతీ సైనిక ప్రతినిధి యాహ్యా సారి ప్రకటించారు. యెమెన్ ప్రావిన్సులలో సౌదీ డ్రోన్లు గగనతలాన్ని ఉల్లంఘించినందుకు ప్రతిస్పందనగా ఈ దాడి చేసినట్లు చెప్పారు. ఇదిలా ఉంటే ఆదివారం తెల్లవారుజామున అరామ్ కో రిఫైనరీకి అనుబంధంగా ఉన్న ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం జరిగినట్లు సౌదీ ఇంధన మంత్రిత్వ శాఖ చెప్పింది.

సౌదీ అరేబియా-పాకిస్తాన్-టర్కీలతో ‘‘మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్’’ కుదిరిన తర్వాతి రోజే హౌతీలు దాడి చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఒప్పందం ప్రకారం, ఒకరిపై ఎవరైనా దాడి చేస్తే, మరో ఇద్దరిపై దాడి చేసినట్లు పరిగణిస్తారు. ఈ ఒప్పందం తర్వాత ఇరాన్ స్పందిస్తూ.. సౌదీ అరేబియాకు ఈ ఒప్పందం రక్షణ కల్పించదని వ్యాఖ్యానించింది. గతంలో అమెరికా రక్షణ ఉన్నప్పటికీ సౌదీకి భద్రత లభించలేదనే విషయాన్ని గుర్తు చేసింది. టర్కీ, పాకిస్తాన్‌లతో కుదుర్చుకున్న ఈ కాగితపు ఒప్పందం సౌదీ భద్రతకు గ్యారెంటీ ఇవ్వదని చెప్పింది. ఈ వ్యాఖ్యలు చేసిన కొద్ది గంటల్లోనే ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ తిరుగుబాటుదారులు దాడులు చేయడం గమనార్హం.