Site icon NTV Telugu

China: చైనాలో కోవిడ్ కల్లోలం.. ఆస్పత్రుల్లో బెడ్లు లేవు.. బ్లాక్ మార్కెట్‌లో మందులు..

Covid 19 In China

Covid 19 In China

Hospitals run out of beds as Covid patients increase in China: చైనాలో కోవిడ్ పరిస్థితులు దుర్భరంగా ఉన్నాయి. అక్కడి  లక్షల్లో ప్రజలు కోవిడ్ బారిన పడుతున్నారు. మరణాలు వేల సంఖ్యలో నమోదు అవుతున్నాయి. ఇదిలా ఉంటే రాజధాని బీజింగ్ లో పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. అన్ని ఆస్పత్రులు కోవిడ్ రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. బీజింగ్ లోని అన్ని ఆస్పత్రుల్లో బెడ్లు అన్ని నిండిపోయాయి. రోగులు హాల్ లో స్ట్రెచర్లపై పడుకున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. వీల్ చైర్ లో ఆక్సిజన్ తీసుకుంటున్నారు కొందరు రోగులు. రోగుల సంఖ్యకు అనుగుణంగా అక్కడ పడకలు లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చికిత్స తీసుకుంటున్న వారిలో వృద్ధులే అధిక మంది ఉంటున్నారు. మరోవైపు రోగుల సంఖ్య పెరగడంతో వైద్యులు, నర్సులు, ఇతర ఆస్పత్రి సిబ్బందిపై ఒత్తడి పడుతోంది.

Read Also: African Swine Flu: మధ్యప్రదేశ్ లో ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ కలకలం.. పందుల చంపివేత

ఇక శ్మశాన వాటికలు కూడా కోవిడ్ రోగుల శవాలతో నిండిపోతున్నాయి. ఓమిక్రాన్ బీఏ.5.2, బీఎఫ్.7 వేరియంట్లు చైనాను అల్లకల్లోలం చేస్తున్నాయి. అత్యంత వేగంగా వ్యాపించే ఈ రెండు వేరియంట్ల వల్ల దేశంలో రోజుకు లక్షల్లో కేసులు నమోదు అవుతున్నాయి. ఇదిలా ఉంటే ఇటీవల చైనా ప్రభుత్వం ‘జీరో కోవిడ్’ విధానాన్ని ఎత్తేయడంతో కేసుల సంఖ్య మరింతగా పెరిగింది. ఓ అంచనా ప్రకారం ఈ నెలలో కేసుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని.. చైనా దేశస్తుల్లో 60 శాతం మంది కోవిడ్ బారిన పడే అవకాశం ఉందని తెలుస్తోంది. వారం రోజుల వ్యవధిలో జనవరి 1 వరకు ఏకంగా 2,20,000 కేసులు నమోదు అయ్యాయి.

ఇదిలా ఉంటే చైనాలో కరోనా మందుల కొరత కూడా వేధిస్తోంది. అక్కడ ప్రజలు బ్లాక్ మార్కెట్లో మందులను కొనుగోలు చేస్తున్నారు. జ్వరం, జలుబు మందులకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. దీంతో దేశవ్యాప్తంగా చాలా మెడికల్ షాపుల్లో ఈ మందులు లభించడం లేదు. డిమాండ్ ను ఆసరా చేసుకుని కొంతమంది వీటిని బ్లాక్ చేస్తున్నారు. దీంతో ఎక్కువ ధరలకు అమ్ముతున్నారు. చైనా మందులు దొరక్కపోవడంతో చాలా మంది భారత తయారీ మందులను పొందేందుకు ప్రయత్నిస్తున్నారు.

Exit mobile version