Harry Boxer Detained in US: లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కీలక అనుచరుడు హ్యారీ బాక్సర్ అరెస్ట్..

Harry Boxer Arrest

Harry Boxer Arrest

Harry Boxer Detained in US: గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన కీలక అనుచరుడు హ్యారీ బాక్సర్‌ను అమెరికాలో అదుపులోకి తీసుకున్నారు. పలు హత్యలు, బెదిరింపులు, బలవంతపు వసూళ్ల కేసుల్లో పోలీసులకు కావాల్సిన హ్యారీ బాక్సర్ అలియాస్ హరిరామ్‌ను అమెరికాలోని కాలిఫోర్నియాలో అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ నుంచి అందిన కీలక సమాచారంతో శుక్రవారం రాత్రి ఈ చర్య చేపట్టినట్లు తెలిపారు.

అధికారుల వివరాల ప్రకారం.. హ్యారీ బాక్సర్ గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌తో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నాడు. అమెరికాలో ఉంటూ గ్యాంగ్ కార్యకలాపాలను నిర్వహిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా భారత్‌లోని పలువురిని లక్ష్యంగా చేసుకుని బెదిరింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. బాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులను కూడా సోషల్ మీడియా పోస్టులు, ఆడియో సందేశాల ద్వారా బెదిరించినట్లు అధికారులు తెలిపారు. దీంతో అతడి కదలికలపై భారత దర్యాప్తు సంస్థలు నిఘా పెట్టాయి.

ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి ముంబైలోని జుహూలో ఉన్న నివాసం వెలుపల ఈ ఏడాది ఫిబ్రవరిలో కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనకు తానే బాధ్యత వహిస్తున్నట్లు హ్యారీ బాక్సర్ ప్రకటించినట్లు సమాచారం. రోహిత్ శెట్టి నివాసం వెలుపల ఐదు రౌండ్ల కాల్పులు జరగడంతో ఆ ప్రాంతంలో కలకలం రేగింది. అయితే సెక్యూరిటీ గార్డు అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించడంతో ఎవరికీ గాయాలు కాలేదు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటికే నలుగురిని అరెస్ట్ చేశారు. తాజాగా హ్యారీ బాక్సర్ అమెరికాలో పట్టుబడటంతో ఈ కేసు మరోసారి వార్తల్లోకి వచ్చింది.

లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు సంబంధించిన పలువురు సభ్యులు విదేశాల్లో ఉంటూ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో హ్యారీ బాక్సర్‌ను అమెరికాలో అదుపులోకి తీసుకోవడం దర్యాప్తు పరంగా కీలక పరిణామంగా భావిస్తున్నారు. అతడిని భారత్‌కు తీసుకురావడానికి సంబంధించి తదుపరి చట్టపరమైన ప్రక్రియలు ఎలా ఉంటాయనే దానిపై అధికారికంగా మరిన్ని వివరాలు వెల్లడించాల్సి ఉంది. హ్యారీ బాక్సర్ అరెస్టుతో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తాయా? బాలీవుడ్ ప్రముఖులకు వచ్చిన బెదిరింపుల వెనుక ఉన్న నెట్‌వర్క్‌పై దర్యాప్తు సంస్థలు ఎలాంటి చర్యలు తీసుకుంటాయన్నది ఆసక్తికరంగా మారింది.