NTV Telugu Site icon

Israel-Hamas War: టెల్ అవీవ్ టార్గెట్‌గా ఇజ్రాయిల్‌పై హమాస్ భారీ క్షిపణి దాడి..

Israel Hamas War

Israel Hamas War

Israel-Hamas War: హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్‌పై భారీగా మిస్సైల్ దాడికి పాల్పడ్డారు. హమాస్ సాయుధ విభాగం అల్ ఖస్సామ్ బ్రిగేడ్స్ ఆదివారం ఇజ్రాయిల్ వాణిజ్య రాజధాని టెల్ అవీవ్ లక్ష్యంగా క్షిపణి దాడి ప్రారంభించింది. ఇజ్రాయిల్ సైన్యం సెంట్రల్ సిటీలోని సైరన్‌లను మోగించింది, రాకెట్లు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది. ఆదివారం తన టెలిగ్రామ్ ఛానెల్‌లో అల్ ఖస్సామ్ బ్రిగేడ్స్ ఒక ప్రకటనలో.. ‘‘పౌరులపై జియోనిస్ట్(ఇజ్రాయిల్) చేస్తున్న మారణకాండకు ప్రతిస్పందగా రాకెట్‌లను ప్రయోగించాము’’ అని చెప్పారు.

Read Also: Cyclone Remal: తీవ్ర తుఫానుగా మారిన ‘రెమల్’.. బంగ్లాదేశ్, బెంగాల్ తీరాన్ని తాకనున్న తుఫాన్

గాజా స్ట్రిప్ నుంచి రాకెట్లు ప్రయోగించినట్లు హమాస్ అల్ అక్సా టీవీ తెలిపింది. గత నాలుగు నెలలుగా టెల్ అవీవ్‌లో రాకెట్ సైరన్లు వినిపించలేదు, అయితే సైరన్‌లకు గల కారణాన్ని ఇజ్రాయిల్ సైన్యం వెంటనే వెల్లడించలేదు. ఇజ్రాయెల్ అత్యవసర వైద్య సేవలు, తమకు ఎలాంటి ప్రాణనష్టం గురించి నివేదికలు అందలేదని చెప్పింది. దక్షిణ గాజాలోని రఫా ప్రాంతం నుంచి హమాస్ కనీసం ఎనిమిది రాకెట్లను ప్రయోగించగా, అనేక రాకెట్లను ఇజ్రాయిల్ సైన్యం అడ్డగించిందని బీబీసీ తెలిపింది. హెర్జ్లియా, పెటా టిక్వాతో సహా వివిధ నగరాల్లో, పట్టణాల్లో సైరన్లు మోగినట్లు నివేదికలు వెల్లడించాయి.

గతేడాది అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్‌పై దాడి చేసి 1200 మందిని హతమార్చడమే కాకుండా 240 మంది బందీలుగా గాజాలోకి తీసుకెళ్లి యుద్ధానికి ఆజ్యం పోశారు. అప్పటి నుంచి ఇజ్రాయిల్ హమాస్ మిలిటెంట్లు, వారి స్థావరాలే లక్ష్యంగా భీకరదాడులు చేస్తోంది. ఇప్పటికే గాజా నగరం సర్వనాశనం అయింది. మరోవైపు ఈజిప్టు-గాజా సరిహద్దుల్లోని రఫాను స్వాధీనం చేసుకునే లక్ష్యంగా ఇజ్రాయిల్ దాడులు చేస్తోంది. ఈ ప్రాంతంలోని హమాస్ మిలిటెంట్లను నిర్మూలించడమే లక్ష్యంగా పేర్కొంది. ఈ యుద్ధం వల్ల అమాయకమైన పాలస్తీనా పౌరులు 36,000 మంది మరణించారు.