Israel-Hamas War: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధ నేపథ్యంలో ఇజ్రాయిల్ ఆర్మీ తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. ఉత్తర గాజాపై హమాస్ ఉగ్రవాదులు నియంత్రణ కోల్పోయారని గాజా ప్రజలను ఉద్దేశించి ఇజ్రాయిల్ ఆర్మీ తెలిపింది. ఇజ్రాయిల్-హమాస్ సంధి నేపథ్యంలో నాలుగు రోజుల పాటు కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చాయి. అయితే ఈ ఒప్పందంలో జాప్యం జరుగుతున్న నేపథ్యంలో ఇజ్రాయిల్ దళాలు తాజా హెచ్చరికలు చేశాయి.
గాజా ప్రజలు మానవతా జోన్‌కి తరలించడానికి సైన్యం స్థానిక కాలమాన ప్రకారం సాయంత్రం 4 గంటల వరకు గడువు ఇచ్చింది. అయితే పాలస్తీనా ప్రజలు సురక్షితమైన దక్షిణం వైపు వెళ్లకుండా హమాస్ ఉగ్రవాదులు అడ్డుకోవచ్చని హెచ్చరించింది. ఉత్తర గాజాలోని ప్రజలకు ముఖ్యంగా గాజా నగరం, జబాలియా, షుజాయా నగరాల చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల నుంచి ప్రజలు మిమ్మల్ని మీరు కాపాడుకునేందుకు వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) ఎక్స్(ట్విట్టర్)లో పేర్కొంది. ఖాన్ యూనిస్‌లోని అల్-సలామ్, అల్-మానారా పరిసరాల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల మద్య సైనిక కార్యకలాపాలల్లో వ్యూహాత్మక విరామం ఉంటుందని తెలిపారు. ఎవరైనా ప్రజల్ని అడ్డుకుంటే కాల్ చేయాలని హెల్ప్ లైన్ నెంబర్ జారీ చేసింది.
Read Also: Uttarkashi tunnel collapse: సొరంగం వద్దకు పల్లకిలో “దేవతామూర్తులు”.. చివరి దశకు రెస్క్యూ ఆపరేషన్..
నాలుగు రోజుల సంధి సమయంలో హమాస్ 50 మంది బందీలను విడుదల చేస్తే, ఇజ్రాయిల్ 150 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేయనుంది. అక్టోబర్7న హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్‌పై దాడి చేసి 1200 మందిని హతమార్చడమే కాకుండా.. 240 మందిని బందీలుగా చేసుకుని గాజాలోకి పట్టుకెళ్లారు. అప్పటి నుంచి ఇజ్రాయిల్ హమాస్ లక్ష్యంగా గాజాపై విరుచుకుపడుతోంది. ఈ దాడుల్లో 13 వేల మంది పాలస్తీనియన్లు మరణించారు. తాజాగా సంధి ఒప్పందం ప్రకారం.. ఏడు వారాల భీకర యుద్ధానికి తాత్కాలిక విరామం లభించింది.