Hamas: గతేడాది గాజాలో హమాస్ చీఫ్ యాహ్యా సిన్వార్‌ను ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) హతమార్చింది. ఆ సమయంలో యాహ్యా సిన్వార్‌కు సంబంధించిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది. గాజాలోని టన్నెల్స్‌లో అత్యంత రహస్యంగా ఉండే సిన్వార్‌ని ఇజ్రాయిల్ బలగాలు ఎంతో ట్రాక్ చేసి, చివరకు హతమార్చింది. ఇదిలా ఉంటే, ఆయన భార్య గాజా నుంచి తప్పించుకుని, టర్కీకి వెళ్లినట్లు తెలుస్తోంది.
ఇస్లామిక్ యూనివర్సిటీ ఆఫ్ గాజా నుంచి థియోలజీలో డిగ్రీ పొందిన సమర్ ముహమ్మద్ అబూ జమర్, 2011లో సిన్వార్‌ని పెళ్లి చేసుకుంది. అయితే, ఆమె నకిలీ పాస్‌పోర్ట్ ఉపయోగించి తన పిల్లలతో గాజా స్ట్రిప్ నుంచి పారిపోయినట్లు నివేదికలు వెలువడ్డాయి. అబూ జమర్ గాజాకు చెందిన వేరే మహిళ పాస్‌పోర్టును ఉపయోగించి, రఫా సరిహద్దు దాటి ఈజిప్టులోకి వెళ్లిందని, ఆ తర్వాత టర్కీకి చేరినట్లు తెలిసింది. టర్కీలో మరో వ్యక్తిని వివాహం చేసుకుందని నివేదిక వెల్లడించింది.
Read Also: India vs Pakistan: పాకిస్థాన్‌తో అవసరమా?.. బాయ్‌కాట్ ఆసియా కప్!
గాజాలో ఎవరి దగ్గర లేని డబ్బు, లాజిస్టిక్ సపోర్టు, ఉన్నతస్థాయిలో సహకారం ఉంటేనే ఇలా పారిపోవడం సాధ్యమైందని అంచనా వేస్తు్న్నారు. గతేడాది అక్టోబర్‌లో యహ్యా సిన్వార్ మరణం తర్వాత, ఆమె మళ్లీ వివాహం చేసుకుంది. హమాస్ పొలిటికల్ బ్యూరోలోని సీనియర్ అధికారి అయిన ఫాలి హమ్మద్ ఈ వివాహాన్ని ఏర్పాటు చేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. హమాద్ గతంలో కూడా హమాస్ ఉగ్రవాదుల కుటుంబాలను ఇలాగే తరలించిన సంఘటనలు ఉన్నాయి.
సిన్వార్ మరణం తర్వాత హమాస్‌కి నాయకత్వం వహిస్తున్న అతని సోదరుడు మొహమ్మద్ భార్య నజ్వా కూడా ఇదే విధంగా గాజా విడిచిపెట్టినట్లు భావిస్తున్నారు. ఈ ఇద్దరూ కూడా తమ భర్తల మరణాలకు ముందే గాజాను వదిలినట్లు ఇజ్రాయిల్ భద్రతా వర్గాలు ధ్రువీకరించాయి.
