NTV Telugu Site icon

Solar Cycle: సూర్యుడిపై గందరగోళ పరిస్థితి.. ఒక సౌర చక్రం పూర్తికాక ముందే, మరొకటి ప్రారంభం..

The Sun

The Sun

Solar Cycle: సూర్యుడు ప్రస్తుతం తన 25వ ‘సోలార్ సైకిల్’(సౌర చక్రం)లో ఉన్నాడు. 11 ఏళ్ల పాటు సాగే ఈ ప్రక్రియలో ప్రస్తుతం సగం కాలం పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం సోలార్ సైకిల్ గరిష్టానికి చేరుకుంది. దీనిని ‘సోలార్ మాగ్జిమం’గా వ్యవహరిస్తుంటారు. దీని కారణంగానే సూర్యుడిపై నిరంతర పేలుళ్లు, సన్ స్పాట్స్, కరోనల్ మాస్ ఎజెక్షన్స్(సీఎంఈ)లు ఏర్పడుతుంటాయి. సూర్యుడి నుంచి సౌర జ్వాలలు ఎగిసిపడుతుంటాయి. వీటి కారణంగా భూమిపై ‘‘భూ అయస్కాంత తుఫానులు’’ ఏర్పడుతుంటాయి.

ప్రతీ సోలార్ సైకిల్‌లో సూర్యుడిపై ఉండే అయస్కాంత ధృవాలు మారుతాయి. ఇలా మార్చుకునే సమయంలో సూర్యుడి వాతావరణంపై గందరగోళం ఏర్పడుతుంది. దీని అయస్కాంత క్షేత్రాల బలాల వల్ల సూర్యుడిపై భారీ విస్ఫోటనాలు ఏర్పడుతుంటాయి. ప్రస్తుతం సూర్యుడిపై ఈ సోలార్ సైకిల్ 2019లో ప్రారంభమైంది. ఇది 2025 మధ్యకాలం నాటికి ఈ ధృవాల మార్పుతో సూర్యుడిపై కార్యకలాపాలు తీవ్రస్థాయికి చేరుకుంటాయి. దీనిని సోలార్ మాగ్జిమం అని చెబుతారు. ఈ సమయంలో ఎక్కువగా సన్‌స్పాట్‌లు, సౌరజ్వాలలు మరియు కరోనల్ మాస్ ఎజెక్షన్‌లు ఏర్పడుతాయి. వీటిని ఇప్పటికే మనం గమనిస్తున్నాం.

Read Also: ISRO somanath: ఐఐటీ మద్రాస్ నుంచి పీహెచ్‌‌డీ పట్టా అందుకున్న ఇస్రో చైర్మన్

భూమిపై వీటి ప్రభావం చాలా ఉంటుంది. సూర్యుడి నుంచి దూసుకొచ్చే సౌర జ్వాలలు ఫలితంగా భూమిపై ‘‘జియో మాగ్నెటిక్ తుఫానులు’’ ఏర్పడుతున్నాయి. వీటి ఫలితంగా భూమి ధృవాల వద్ద ప్రకాశవంతమైన అరోరాలు ఏర్పడుతున్నాయి. భూమికి ఉన్న బలమైన అయస్కాంత క్షేత్రం వల్ల సమస్త మానవాళి రక్షించబడుతున్నారు. సూర్యుడి నుంచి వచ్చే ఈ ప్రమాదకరమైన తుఫానులను భూ అయస్కాంత క్షేత్రం తిప్పికొడుతుంది.

ఇదిలా ఉంటే, ప్రస్తుతం ఉన్న సోలార్ సైకిల్ మరో ఆరేళ్ల పాటు సాగుతుంది. అయితే తాజా పరిశోధనలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. బర్మింగ్‌హామ్ యూనివర్సిటీ పరిశోధనల్లో సూర్యుడు మరో ‘సౌర చక్రాన్ని’ ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన సంకేతాలను పరిశోధకులు గుర్తించారు. సూర్యునిలోని అంతర్గత ధ్వని తరంగాల ద్వారా సౌర చక్రం 26 యొక్క ప్రారంభ సంకేతాలను గుర్తించింది. ప్రతి సౌర చక్రం ప్రారంభమయ్యే ముందు సూర్యుడి ఈక్వేటర్ వైపు పదార్థం వేగంగా కదులుతుంది. ఈ మార్పులు 2030 నాటికి ప్రారంభమయ్యే 26వ సోలార్ సైకిల్ మొదటి సూచనలు అందించాయి.