NTV Telugu Site icon

Sundar pichai: డాక్టరేట్ పట్టా అందుకున్న గూగుల్ సీఈవో

Sundarpichai

Sundarpichai

తన తల్లిదండ్రుల కోర్కెను గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ నెరవేర్చారు. తమ కుమారుడు పీహెచ్‌డీ పట్టా అందుకోవాలని ఆ తల్లిదండ్రులు ఎంతగానో ఆశించారు. వారు కోరుకున్నట్టుగానే కొడుకు దాన్ని సాధించి తీసుకొచ్చాడు. దీంతో ఆ తల్లిదండ్రులు ఎంతగానో మురిసిపోయారు. ఈ మేరకు ఇన్‌స్ట్రాగామ్‌లో ఫొటోను గూగుల్ సీఈవో పంచుకున్నారు.

గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఇటీవల శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన ఒక కార్యక్రమంలో ఐఐటీ ఖరగ్‌పూర్ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. డాక్టర్ ఆఫ్ సైన్స్ (Honoris Causa) లభించగా, అతని భార్య అంజలి పిచాయ్ కెమికల్ ఇంజనీరింగ్‌లో పూర్వ విద్యార్థిగా అవార్డును అందుకున్నారు. క్యాంపస్‌లో క్లాస్‌మేట్‌గా ఉన్న అంజలిని పిచాయ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

పిచాయ్.. పీహెచ్‌డీ చేయాలని అతని తల్లిదండ్రులు ఎప్పటి నుంచో కోరుతున్నారు. మొత్తానికి ఇన్నాళ్లకు ఆ కల నెరవేరింది. ఈ స్థితికి చేరుకోవడానికి సహాయం చేసిన ఇన్‌స్టిట్యూట్‌కు సుందర్ పిచాయ్ కృతజ్ఞతలు తెలిపారు. శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన కార్యక్రమానికి ఐఐటీ ఖరగ్‌పూర్ డైరెక్టర్ వీకే తివారితో పాటు సుందర్ పిచాయ్ తల్లిదండ్రులు, పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

పిచాయ్.. ఐఐటీ నుంచి మెటలర్జికల్, మెటీరియల్స్ ఇంజినీరింగ్‌లో B.Tech పూర్తి చేశారు. తర్వాత స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఇంజనీరింగ్, మెటీరియల్స్ సైన్స్‌లో ఎంఎస్ పూర్తి చేశారు. అనంతరం వార్టన్ స్కూల్ నుంచి ఎంబీఏ చేశారు. 2004లో గూగుల్‌లో చేరారు. ఈ సమయంలో క్యాంపస్‌లో తన క్లాస్‌మేట్ అంజలిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.