Germany: జర్మనీలో దుండగుడు కాల్పులు.. ఐదుగురు మృతి

  • జర్మనీలో దుండగుడు కాల్పులు
  • ఐదుగురు మృతి.. నిందితుడు అరెస్ట్
  • కాల్పులకు గల కారణాలు వెల్లడించని అధికారులు
Germany

Germany

జర్మనీలో కాల్పుల ఘటన కలకలం రేపింది. ఉత్తర జర్మనీలోని స్టాడే పట్టణంలో సోమవారం జరిగిన కాల్పుల్లో కనీసం ఐదుగురు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఘటన అనంతరం ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఈ ఘటనపై విస్తృత దర్యాప్తు కొనసాగుతోంది.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. కాల్పులకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. మృతుల వివరాలను కూడా అధికారులు ఇంకా వెల్లడించలేదు. ఘటన ఎలా జరిగింది? దాడికి దారితీసిన పరిస్థితులు ఏంటి? అనే అంశాలపై దర్యాప్తు చేస్తున్నారు.

జర్మన్ వార్తా సంస్థ డీపీఏ (dpa) కథనం ప్రకారం.. సుమారు 50 వేల జనాభా కలిగిన స్టాడే పట్టణంలోని ఓ యూత్ సెంటర్ సమీపంలో ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ పట్టణం హాంబర్గ్ నగరానికి పశ్చిమ దిశలో ఉంది. స్థానిక మీడియా కథనాల ప్రకారం.. ఈ ఘటనలో ఒకటి కంటే ఎక్కువ మంది నిందితులు ఉండే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే దీనిని పోలీసులు ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు.

ఘటన అనంతరం డాంకర్స్‌స్ట్రాసే పరిసర ప్రాంతాల్లో భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. ఆ ప్రాంతానికి ప్రజలు వెళ్లొద్దని, అత్యవసర సిబ్బంది సూచనలను తప్పనిసరిగా పాటించాలని పోలీసులు హెచ్చరించారు. ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు ధృవీకరించినప్పటికీ.. మృతుల కచ్చిత సంఖ్య, నిందితుడి గుర్తింపు, బాధితుల వివరాలు వంటి అంశాలను ఇప్పటివరకు వెల్లడించలేదు. ప్రస్తుతం అత్యవసర సిబ్బంది, ఫోరెన్సిక్ బృందాలు ఘటనాస్థలంలో ఆధారాలు సేకరిస్తుండగా.. కాల్పుల వెనుక అసలు ఉద్దేశం ఏమిటన్న దానిపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

అమెరికా కంటే జర్మనీలో తుపాకీ చట్టాలు కఠినంగా ఉంటాయి. సామూహిక కాల్పులు అరుదుగా జరుగుతాయి. ఎల్లప్పుడూ జరగవు. స్టేడ్ జనాభా సుమారు 50,000 మంది. ఇది హాంబర్గ్‌కు పశ్చిమాన ఉంది.