NTV Telugu Site icon

Imran Khan: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రాజకీయ సలహాదారుడి కిడ్నాప్..

Imran Khan

Imran Khan

Imran Khan: అవినీతి కేసుల్లో పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైలులో ఉన్నారు. అతని పార్టీ పీటీఐకి చెందిన పలువురు కీలక నేతలు కూడా పలు అభియోగాలను ఎదుర్కొంటున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఆయన రాజకీయ సలహాదారు లాహోర్‌లో కిడ్నాప్‌కి గురయ్యాడు. గుర్తుతెలియని వ్యక్తులు అతడిని కిడ్నాప్ చేసినట్లు ఈ రోజు అక్కడి మీడియా కథనాలు తెలిపాయి.

పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ నాయకుడు షాబాజ్ గిల్ అన్నయ్య అయిన గులాం షబ్బీర్ రెండు రోజుల క్రితం ఇస్లామాబాద్‌కు వెళుతుండగా గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారని కహ్నా పోలీస్ స్టేషన్‌‌లో ఎఫ్ఐఆర్ నమోదైనట్లు పాకిస్తాన్ ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ వార్తాపత్రిక నివేదించింది. లాహోర్‌లోని ఖయాబాన్-ఎ-అమీన్‌లోని తన నివాసం నుండి షబ్బీర్ అర్థరాత్రి ఇస్లామాబాద్ వైపు బయలుదేరినట్లు అతని కుమారుడు బిలాల్ ఫిర్యాదు చేశాడు. అప్పటి నుంచి అతడి ఆచూకీ లభించలేదు.

Read Also: Pavithra Ex Husband: దర్శన్ భార్య విజయలక్ష్మిపై పవిత్ర గౌడ మాజీ భర్త సంజయ్ సింగ్ ఫిర్యాదు?

2022లో పాకిస్తాన్ ప్రధానిగా పదవిని కోల్పోయిన ఇమ్రాన్ ఖాన్ దాదాపుగా 200 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. కొన్ని కేసుల్లో దోషిగా తేలాడు. గత ఏడాది ఆగస్టు నుంచి జైలులో ఉన్నాడు. పాకిస్తాన ప్రధానిగా దిగిపోయిన తర్వాత షహబాజ్ షరీఫ్ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ పార్టీని పోటీ నుంచి నిషేధించారు. ఆయన మద్దతుదారులు ఇండిపెండెంట్‌లుగా పోటీ చేశారు. అయినప్పటికీ వీరికి మెజారిటీ మార్కు రాకపోవడంతో మళ్లీ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పార్టీ అయిన పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్(పీఎంఎల్-ఎన్), బిలావల్ భుట్టోకి చెందిన పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ)లు కలిసి ప్రధాని షహబాజ్ షరీఫ్ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.