Former Pakistan PM Imran khan booked under terror act: పాకిస్తాన్ ప్రభుత్వం మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను అరెస్ట్ చేసేందుకు సిద్ధం అవుతోంది. ఇప్పటికే ఇమ్రాన్ ఖాన్ పై అక్రమ నిధుల కేసు నమోదు చేసిన పాక్ ఏజెన్సీలు, తాజాగా ఇమ్రాన్ ఖాన్ పై ఉగ్రవాద నిరోధక చట్టం కింద కేసు నమోదు అయింది. దీంతో ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ త్వరలో జరగొచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. న్యాయ, చట్టాల అధికారులపై విమర్శలు చేసినందుకు, వారిని బెదిరించేలా మాట్లాడినందుకు పాక్ ఉగ్రవాద నిరోధక చట్టం సెక్షన్ 7 ప్రకారం ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు అధికారులు.
శనివారం జరిగిన ఓ ర్యాలీలో మాట్లాడుతూ.. ప్రభుత్వ, న్యాయ, సైన్యాలను బెదిరించేలా మాట్లాడుతూ.. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. దేశద్రోహం ఆరోపణలపై గత వారం ఇమ్రాన్ ఖాన్ సహాయకుడు షాబాజ్ గిల్ ను అరెస్ట్ చేశారు. దీంతో పోలీస్ ఉన్నతాధికారులను, మహిళా మెజిస్ట్రేట్, పాకిస్తాన్ ఎన్నికల సంఘంపై, రాజకీయ ప్రత్యర్థులపై కేసులు పెడతానని ఇమ్రాన్ ఖాన్ హెచ్చరించారు. ఇమ్రాన్ ఖాన్ ప్రసంగం సైన్యాన్ని, ఇతర సంస్థలను లక్ష్యంగా చేసుకుని బెదిరింపులకు గురిచేసేలా ఉందని పాకిస్తాన్ అంతర్గత మంత్రి రాణా సనావుల్లా ఆదివారం అన్నారు.
Read Also: Singapore PM Lee Hsien Loong: ఇండియా అందుకనే రష్యా వ్యతిరేక తీర్మాణాలకు దూరంగా ఉంది.
ఇమ్రాన్ ఖాన్ చేసిన ఈ వ్యాఖ్యలపై పాకిస్తాన్ లో దుమారం చెలరేగుతోంది. ఇమ్రాన్ ఖాన్ లైవ్ టెలికాస్ట్ ను బ్యాన్ చేసింది అక్కడి ప్రభుత్వం. పాకిస్తాన్ ఎలక్ట్రానిక్ మీడియా రెగ్యులేటరీ అథారిటీ ఆదేశించినప్పటికీ.. టెలివిజన్ ఛానెళ్లు పదేపదే ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన వ్యతిరేక ప్రసంగాలను ప్రసారం చేశాయి. ఇమ్రాన్ ఖాన్ చేసిన ప్రసంగాలు పాక్ రాజ్యాంగం ఆర్టికల్ 19ని ఉల్లంఘించేలా ఉందని మీడియా రెగ్యులేటరీ అథారిటీ పేర్కొంది. ఇకపై ఆయన ప్రసంగాలను లైవ్ టెలికాస్ట్ చేయకుండా.. రికార్డ్ చేసి ఎడిట్ చేసిన తర్వాతే ప్రసారం చేయాలని ఆదేశిచింది.
