NTV Telugu Site icon

Pakistan: మరో ఉగ్రవాది ఖతం.. అల్ బదర్ ఉగ్రసంస్థ కాశ్మీర్ మాజీ కమాండర్ హత్య.

Pakistan

Pakistan

Al Badr Terrorist shot dead in Pakistan: భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేసిన ఉగ్రవాదులు ఒక్కొక్కరుగా హతం అవుతున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపుతున్నారు. భారత్ మోస్ట్ వాంటెడ్ హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాది బషీర్ అహ్మద్ పీర్ అలియాస్ ఇంతియాజ్ ఆలంను ఇటీవల పాకిస్తాన్ రావల్పిండి నగరంలో గుర్తు తెలియని వ్యక్తులు పాయింట్ బ్లాక్ లో కాల్చిచంపారు. ఇదిలా ఉంటే ఆదివారం మరో ఉగ్రవాది ఇలాగే హతమయ్యాడు. పాక్ ఉగ్రవాద సంస్థ అల్ బదర్ మాజీ కమాండర్ సయ్యద్ ఖలీద్ రజాను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. కరాచీలోని గులిస్తాన్ ఏ జోహర్ బ్లాక్ 7 ప్రాంతంలోని అతని నివాసంలో కాల్చి చంపారు.

Read Also: Chiranjeevi: బ్రేకింగ్.. చిరంజీవి సినిమా సెట్ లో అగ్నిప్రమాదం

1990వ దశకంలో 8 ఏళ్ల పాటు సయ్యద్ ఖలీద్ రజా జమ్మూ కాశ్మీర్ అల్ బదర్ ఉగ్రవాద సంస్థ కమాండర్ గా వ్యవహరించారు. జమాత్ ఇ ఇస్లామీ అధ్యక్షుడు కరాచీ ప్రకారం.. మరణించిన వ్యక్తి కూడా జేఐ తల్బా వింగ్ తో సంబంధం కలిగి ఉన్నాడు. జమ్మూకాశ్మీర్ ను భారత్ నుంచి విడదీసి పాకిస్తాన్ లో కలిపే ఉద్దేశంతో ఈ అల్ బదర్ ఉగ్రసంస్థ 1998లో ఏర్పాటైంది. కొంత కాలం హిజ్బుల్ ముజాహిదీన్ తో కలిసి పనిచేసింది. ప్రభుత్వ అధికారులు, భద్రతా దళాలు మరియు పౌరులపై కూడా దాడి చేసింది. 2002లో జమ్మూ ప్రాంతంలో ఈ ఉగ్రసంస్థ జరిపిన దాడిలో ముగ్గురు కాశ్మీరీ మహిళలు చనిపోయారు.

2003లో పాకిస్తాన్-భారత్ మధ్య చర్చలను తీవ్రంగా వ్యతిరేకించింది. చర్చలను ఆశ్రయించే బదులు భారత్ పై జీహాద్ చేయాలని పేర్కొంది. ఈ ఉగ్రసంస్థకు జమాతే ఇస్లామ్, ఐఎస్ఐ చాలా కాలం వరకు నిధులను అందించి కాశ్మీర్ లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించాయి. కార్గిల్ యుద్ధ సమయంలో పాకిస్తాన్ కు మద్దతుగా పోరాడింది. జైషే మహ్మద్, లష్కరే తోయిబా తరువాత కాశ్మీర్ లో ఆత్మాహుతికి పాల్పడిన సంస్థగా అల్ బదర్ కు పేరుంది. ప్రస్తుతం దీనికి భక్త్ జమీన్ నాయకత్వం వహిస్తున్నట్లు తెలుస్తోంది. లడఖ్ ను అనుకుని ఉన్న గిల్గిట్ బాల్టిస్తాన్ లోని స్కర్దు కేంద్రంగా తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు సమాచారం.

Show comments