Flight Emergency: అమెరికాలో ఓ విమానం తృటిలో ప్రమాదం నుంచి బయటపడింది. 10 నిమిషాల్లోనే ఏకంగా 28,000 అడుగుల దిగువకు విమానం చేరింది. దీంతో ఒక్కసారిగా ప్రయాణికులు గుండె జారిన పనైంది. చివరకు ఎలాగొలా సేఫ్ ల్యాండింగ్ కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. యునైటెడ్ ఎయిర్‌లైన్స్ కి చెందిన విమానం బుధవారం అమెరికా నేవార్క్ నుంచి రోమ్‌కి వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది.
Read Also: Nipah Virus: కేరళలో మరో నిపా కేసు.. డేంజర్ అంటున్న వైద్యులు..!
బోయింగ్ 777 విమానం 270 మంది ప్రయాణికులు, 14 మంది సిబ్బందితో టేకాఫ్ అయిన వెంటనే విమానం ప్రమాదానికి దగ్గరగా వెళ్లింది. అకాస్మత్తుగా విమానం తన ఎత్తును కోల్పోయింది. ఫ్లైట్ టేకాఫ్ అయిన కొద్ది సేపటికే సమస్య తలెత్తడంతో వెంటనే నేవార్క్ ఎయిర్ పోర్టుకి తిరిగి వచ్చింది. విమానంలో పీడనానికి సంబంధించిన సమస్య తలెత్తడాన్ని సిబ్బంది గుర్తించింది. ఈ క్రమంలోనే సాధ్యమైనంత త్వరగా ఎత్తును తగ్గించి, విమానాన్ని వెనక్కి మళ్లించాలని పైలెట్లు నిర్ణయించారు. దీంట్లో భాగంగానే విమానం 10 నిమిషాల వ్యవధిలోనే ఏకంగా 28 వేల అడుగుల కిందికి దిగినట్లు ఫైట్ అవేర్ డేటాను ఉటంకిస్తూ న్యూయార్క్ పోస్ట్ కథనాన్ని ప్రచురించింది.
నివేదిక ప్రకారం నేవార్క్ నుంచి రాత్రి 8.37 గంటలకు రోమ్ కి యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానం ప్రయాణమైంది. క్యాబిన్ ప్రెజర్ సమస్య తలెత్తడంతో రాత్రి 12.37 గంటలకు తిరిగి టేకాఫ్ అయిన చోటుకే వచ్చింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. ప్రయాణికులను వేరే ఫ్లైట్ లో గమ్యస్థానానికి చేర్చినట్లు యునైటెడ్ ఎయిర్‌లైన్స్ తెలిపింది. విమానం ఎత్తులో ఉన్న సమయంలో ప్రయాణికులకు అవసరమైన పీడనం ఉండాలి, అయితే కొన్ని సందర్భాల్లో క్యాబిన్ లో ఉన్న పీడనంలో సమస్యలు ఏర్పడితే వెంటనే పైలెట్లు విమానాన్ని కిందకు తీసుకువస్తారు.