NTV Telugu Site icon

Bangladesh MP Murder: సెప్టిప్ ట్యాంకులో బంగ్లాదేశ్ ఎంపీ మాంసం.. ఫోరెన్సిక్ విచారణ..

Bangladesh Mp Murder

Bangladesh Mp Murder

Bangladesh MP Murder: బంగ్లాదేశ్ అధికారి పార్టీ ఎంపీ అన్వరుల్ అజీమ్ కోల్‌కతాలో హత్యకు గురవ్వడం సంచలనంగా మారింది. వైద్య చికిత్స కోసం మే 12 వచ్చిన అతను మే 14 నుంచి కనిపించకుండా పోయారు. తాజాగా ఎక్కడైతే అతను హత్యకు గురయ్యాడని భావిస్తున్నారో, ఆ అపార్ట్‌మెంట్‌లోని సెప్టిప్ ట్యాంక్‌లో మూడున్నర కిలోల మాంసం లభించింది. అన్వరుల్ హసన్‌ని హత్య చేసి, అతని చర్మాన్ని ఒలిచి, ముక్కలుగా నరికి ప్యాక్ చేసి నగరంలోని పలు ప్రాంతాల్లో పారేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Read Also: Israel Strike On Rafah: రఫా దాడిలో 21 మంది మృతి.. తమ పని కాదన్న ఇజ్రాయిల్..

సెప్టిక్ ట్యాంక్‌లో లభించిన మాంసం మానవుడిదా, అన్వరుల్ శరీర భాగమేనా అని నిర్ధారించేందుకు ఫోరెన్సిక్ విచారణ చేపట్టినట్లు పోలీస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఎంపీకి సంబంధించిన శరీర భాగాల జాడ కనుగొనబడలేదు. బంగ్లాదేశ్ డిటెక్టివ్ డిపార్ట్‌మెంట్ చీఫ్ హరున్-ఉర్-రషీద్ దీనిని “కోల్డ్ బ్లడెడ్, అనాగరిక హత్య”గా అభివర్ణించారు. ఈ కేసును దర్యాప్తు చేయడానికి ప్రస్తుతం ఆయన ఇండియాలోనే ఉన్నారు. అన్వరుల్‌ని హత్య చేసిన వ్యక్తిని బంగ్లాదేశ్‌కి చెందిన అక్రమ వలసదారుగా గుర్తించారు, కసాయి వృత్తి చేస్తున్నట్లు కనుగొన్నారు. ఈ కేసులో అతడిని విచారిస్తున్నారు. మిగిలిన శరీర భాగాలను కనుగొనేందుకు మురుగు నీటి పైప్ లైన్‌ని పరిశీలించామని, దీనికి పశ్చిమ బెంగాల్ సీఐడీ సహాయం తీసుకున్నామని రషీద్ చెప్పారు.

ఎంపీకి స్నేహితుడైన అక్తరుజ్జమాన్ అనే అమెరికా సిటిజన్ ఈ హత్య చేయించినట్లు తెలుస్తోంది. అక్తరుజ్జమాన్ దీని కోసం రూ. 5 కోట్లు ఖర్చు చేశాడని, ఇందులో కొంత భాగాన్ని తనకు ఇచ్చినట్లు హత్య చేసిన కసాయి వృత్తిలో ఉన్న జిహాద్ హవ్లాదార్ ఒప్పుకున్నాడు. కోల్‌కతాలోని న్యూ టౌన్ ప్రాంతంలోని ఒక ఫ్లాట్‌లో తాను, మరో నలుగురు కలిసి బంగ్లాదేశ్ ఎంపీని హతమార్చినట్లు హవ్లాదార్ ఒప్పుకున్నాడు. అక్తరుజ్జమాన్ ఆదేశాల మేరకే హత్య జరిగిందని వెల్లడించారు. బంగ్లాదేశ్ అధికార షేక్ హసీనా పార్టీ అయిన అవామీ లీగ్ ఎంపీగా ఉన్న అన్వురల్ అజీమ్ అన్వర్ మూడుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు.

Show comments