NTV Telugu Site icon

Fertility rate: సంతానోత్పత్తి రేటులో టాప్ 29 దేశాలు ఆఫ్రికాలోనే..

Fertility Rate

Fertility Rate

Fertility Rate:ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరుకుంది. 19 శతాబ్ధంలో 100 కోట్ల మైలురాయిని చేరుకున్న ప్రపంచ జనాభా, గత 50 ఏళ్లలోనే రెట్టింపు అయింది. 1975 తర్వాతే సగం జనాభా పెరిగారు. దాదాపుగా 140 కోట్ల జనాభాతో భారత్ ‘థ్రెష్ హోల్డ్ లిమిట్’కు చేరుకుంది. ఇదిలా ఉంటే సంతానోత్పత్తి రేటులో మాత్రం ఆఫ్రికా దేశాలు దూసుకుపోతున్నాయి. చైనా, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాల్లో సంతానోత్పత్తి రేటు క్షీణించగా.. ఆఫ్రికా దేశాల్లో మాత్రం ఇది ఎక్కువగా ఉంది. ఏకంగా టాప్ -29 దేశాలు ఆఫ్రికా ఖండానికి చెందిన దేశాలే ఉన్నారు.

2.6 కోట్ల జనాభా ఉన్న ఆఫ్రికా దేశంలో నైజర్ సంతానోత్పత్తి రేటులో అగ్రస్థానంలో ఉంది. జనాభా నిరంతర పెరుగుదలకు ప్రధాన కారణం నాణ్యమైన వైద్య, ఆరోగ్య సేవలు విస్తృతంగా అందుబాటులోకి రావడంతో పాటు పోషకాహార లభ్యత పెరగడం. అయితే క్రమంగా సంతానోత్పత్తి రేటు క్షీణిస్తుండటంతో జనాభా వృద్ధికి అడ్డుకట్ట పడుతోందని నిపుణులు పేర్కొంటున్నారు. 2100 నాటికి జనాభా పెరుగుదల ఆగిపోతుందని ప్రపంచ బ్యాంక్‌ అంచనా వేసింది. వివిధ దేశాల్లో సంతానోత్పత్తి రేటును విశ్లేషించి ఓ నివేదిక రూపొందించింది.

‘థ్రెష్ హోల్డ్ లిమిట్’ లో భారత్

1960లో ప్రపంచ సరాసరి సంతానోత్పత్తి రేటు 4.7 కాగా, 2020 చివరి నాటికి 2.3 శాతానికి పడిపోయింది. సంతానోత్పత్తి రేటు ఇలా ఉంటే జనాభా పెరుగుదల, తగ్గుదల ఉండదు. ముందు తరం స్థానంలో కొత్త తరం వచ్చి చేరుతుంటుంది. దీన్ని ‘థ్రెష్‌ హోల్డ్‌ లిమిట్‌’ లేదా ‘రీప్లేస్‌మెంట్‌ రేట్‌’గా వ్యవహరిస్తారు. ప్రపంచ జనాభాలో దాదాపు మూడింట రెండు వంతుల మంది ‘రీప్లేస్‌మెంట్‌ రేట్‌’ కంటే తక్కువగా ఉన్న ప్రాంతంలో నివసిస్తున్నారు. మన దేశం కూడా ఈ కేటగిరీలోనే ఉంది. థ్రెష్ హోల్డ్ లిమిట్ లో భారత్ 103వ స్థానంలో ఉంది. ప్రస్తుతం మన దేశంలో సంతానోత్పత్తి రేటు 2.05గా ఉన్నట్లు ప్రపంచ బ్యాంకు పేర్కొంది. గర్భనిరోధ అవకాశాలు, అత్యాధునిక వైద్య సదుపాయాలు పెరగడం, శిశుమరణాల సంఖ్య క్రమంగా క్షీణించడం వంటివి సంతానోత్పత్తి రేటు తగ్గడానిక కారణం అవుతున్నాయి.

Read Also: Jagadish Shettar: బీజేపీ నాకు అన్నీ ఇచ్చింది.. కానీ ఆ విషయంలో బాధతోనే కాంగ్రెస్‌లో చేరా..

నైజర్ టాప్.. దక్షిణ కొరియాలో అత్యల్పం

సంతానోత్పత్తి రేటులో నైజర్ టాప్ ప్లేస్ లో ఉంది. ఇక్కడ 6.9 శాతం సంతానోత్పత్తి రేటును కలిగి ఉంది. అంటే సగటున ఓ మహిళ ఏడుగురు పిల్లలకు జన్మనిస్తోంది. ఆఫ్ఘనిస్తాన్ (14 వస్థానం) మినహా మిగతా టాప్ సంతానోత్పత్తి దేశాలు ఆఫ్రికాలోనే ఉన్నాయి. ఇదిలా ఉంటే దక్షిణ కొరియా అత్యత్ప సంతానోత్పత్తి రేటు 0.84 శాతాన్ని కలిగి ఉంది. 2100 నాటికి ఆఫ్రికా దేశాలు మరో 250 కోట్ల జనాభాను జోడిస్తుంది. ఇదిలా ఉంటే ఆశ్చర్యకరంగా ఎక్కువ జనాభా ఉన్న చైనా, ఇండియా, అమెరికా వంటి దేశాలు రీప్లేస్మెంట్ రేట్ కంటే తక్కువ ఉండటం గమనార్హం.

తగ్గినా.. పెరిగినా తిప్పలే..

నిజానికి జనాభా ఆ దేశ వనరులకు సరిపడా ఉంటే అక్కడ ప్రజల సంక్షేమం బాగుంటుంది. అయితే సంతానోత్పత్తి రేటు తక్కువగా ఉన్న దేశాల్లో మెరుగైన సామాజిక, ఆర్థిక అభివృద్ధి సాధ్యం అయింది. అయితే ఇప్పుడు జనాభా తగ్గితే విపరీతమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కొత్త జనాభా రాకపోవడంతో వృద్ధజనాభా విపరీతంగా పెరుగుతోంది. జపాన్, దక్షిణ కొరియా, చైనా దేశాలు ఇప్పుడు ఇలాంటి సమస్యనే ఎదుర్కొంటున్నాయి. పనిచేసేవారు లేక పోవడంతో పాటు వృద్ధుల సంక్షేమం ఆర్థిక వ్యవస్థకు భారంగా మారుతోంది.

Show comments