Site icon NTV Telugu

Pakistan: ‘‘బంగ్లాదేశ్‌ని చూస్తుంటే సిగ్గుగా ఉంది’’.. పాక్ ప్రధాని కీలక వ్యాఖ్యలు..

Pm Shahbaz Sharif

Pm Shahbaz Sharif

Pakistan: పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితిపై ఆ దేశ ప్రధాని షహబాజ్ షరీఫ్ విచారం వ్యక్తం చేశారు. ఆర్థిక వృద్ధి సాధించాలంటే ముందుగా రాజకీయ స్థిరత్వంపై దృష్టి పెట్టాలని పాకిస్తాన్ వ్యాపారులు షెహబాజ్ షరీఫ్‌ని కోరారు. భారత్‌తో వాణిజ్య చర్చలు ప్రారంభించాలని సూచించారు. బంగ్లాదేశ్ ఆర్థిక వృద్ధిపై వ్యాఖ్యానించిన పాక్ ప్రధాని.. ఒకప్పుడు పాకిస్తాన్‌లో భాగం ఉన్న ఈస్ట్ పాకిస్తాన్(ప్రస్తుత బంగ్లాదేశ్) ఆనాడు దేశంపై భారంగా భావిస్తే, ఇప్పుడు పారిశ్రామిక వృద్ధిలో అద్భుతమైన పురోగతి సాధించిన విసయాన్ని గుర్తించాలని అన్నారు.

Read Also: Retirement: 17 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన స్టార్ క్రికెట‌ర్‌..

రెండోసారి పాకిస్తాన్ ప్రధానిగా పగ్గాలు చేపట్టిన షెహబాజ్ షరీఫ్, పాకిస్తాన్ వ్యాపారవేత్తలతో కరాచీలో సమావేశమయ్యారు. ప్రస్తుత పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో మీకు తెలుసని, బంగ్లాదేశ్ అభివృద్ధిని చూస్తుంటే సిగ్గు పడాల్సి వస్తోందని పాక్ పీఎం అన్నారు. కరాచీలోని సింధ్ సీఎం హౌజ్‌లో బుధవారం జరిగిన సమావేశంలో వ్యాపార వర్గాలతో కలిసి ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచేందుకు మార్గాలను అణ్వేషించారు. ఆర్థిక సమస్యలను పరిష్కరించడానికి చొరవ చూపుతున్న ప్రధానిని వ్యాపారులు ప్రశంసించారు. అయితే, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ నేపథ్యంలో దేశంలో రాజకీయ అస్థిరతపై వారు ఆందోళన వ్యక్తం చేశారు.

ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ముందు రాజకీయ స్థిరత్వాన్ని తీసుకురావాలని ప్రధానికి వ్యాపారులు సూచించారు. భారత్‌తో వాణిజ్య చర్చలు ప్రారంభించాలని వారంతా కోరారు. జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత పాకిస్తాన్, భారత్‌తో వ్యాపార-వాణిజ్య సంబంధాలను నిలిపేసింది. దీంతో పాకిస్తాన్ ఆర్థిక సమస్యలు మరింత ఎక్కువయ్యాయి. ఆ సమయంలో పాక్ భారత రాయబారిని బహిష్కరించింది. భారత్‌తో ప్రత్యక్ష వాణిజ్య సంబంధాలను కూడా తెంచుకుంది.

Exit mobile version