Election Day Terror Attack: నవంబర్ 5వ తేదీన అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎలక్షన్స్ పై యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఈ క్రమంలో ఎన్నికల రోజున ఉగ్రదాడికి కుట్ర పన్నిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు యూఎస్ న్యాయశాఖ ప్రకటించింది. అయితే, అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. 2021లో నాసిర్ అహ్మద్ తౌహేదీ ప్రత్యేక వలస వీసాపై అమెరికాకు వచ్చాడు. ప్రస్తుతం ఓక్లహోమా నగరంలో జీవనం కొనసాగిస్తున్నాడు. అమెరికాలో ఎన్నికల రోజున ఐఎస్‌ఐఎస్ పేరుతో ఉగ్రదాడి చేయాలని ప్లాన్ చేసినట్లు సమాచారం. కెమెరాలను యాక్సెస్ చేయడం, లైసెన్స్‌లు లేకుండా గన్‌లు దొరికే రాష్ట్రాల గురించి అహ్మద్ సోషల్ మీడియాలో సెర్చ్ చేశాడు. అందులో భాగంగా వైట్ హౌస్, వాషింగ్టన్ వెబ్ కెమెరాలను సందర్శించినట్లు తెలింది. రెండు ఏకే- 47 రైఫిళ్లు, మందుగుండు సామగ్రిని కొనుగోలు చేసినట్లు యూఎస్ అధికారులు గుర్తించారు.
అలాగే, పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడే ప్రాంతాలే లక్ష్యంగా దాడికి ప్రణాళిక చేసినట్లు అహ్మద్ విచారణలో వెల్లడైందని అధికారులు చెప్పారు. ఆ సమయంలో నిందితుడు, అతడి సహచరులు ఆత్మాహుతిదళంగా మారిపోవాలనుకున్నట్లు విచారణలో వెల్లడైంది. అమెరికా జాతీయ భద్రతకు ఐఎస్‌ఐఎస్.. దాని మద్దతుదారుల నుంచి వచ్చే ముప్పును సమర్థంగా యూఎస్ ఇంటలిజెన్స్ బృందం ఎదుర్కొంటుంది. అమెరికన్ ప్రజలను భయబ్రాంతులకు గురి చేసే వ్యక్తులను గుర్తించి.. అరెస్ట్ చేస్తామని యూఎస్ అటార్నీ జనరల్ మెరిక్ గార్లాండ్ వెల్లడించారు. ఇక, ఇజ్రాయెల్- హమాస్ యుద్ధం నేపథ్యంలో అమెరికా ఇజ్రాయెల్‌కు సపోర్టుగా నిలిచింది. ఈ కారణాలతో అమెరికాలో దాడులు జరిగే ఛాన్స్ ఉందని డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ వెల్లడించింది. ఇస్లామిక్ స్టేట్, ఆల్‌ఖైదాతో సహా విదేశీ ఉగ్రవాద సంస్థలు అమెరికాలో దాడులు నిర్వహించాలని ప్లాన్ చేశాయని గత నెల విడుదల చేసిన తమ నివేదికలో తెలిపింది.