Meta Layoffs: టెక్ కంపెనీలో లేఆఫ్స్ ఆగడం లేదు. ఎప్పుడు ఎవరి ఉద్యోగం పోతుందో తెలియని పరిస్థితి. ప్రపంచ వ్యాప్తంగా ఐటీ దిగ్గజ కంపెనీలుగా పేరొందిన మెటా, మైక్రోసాఫ్ట్, గూగుల్, ట్విట్టర్, అమెజాన్ వంటి కంపెనీలు తమ ఉద్యోగులను వరసగా తొలగించాయి. లేఆఫ్స్ ట్రాకింగ్ సైట్ ప్రకారం 2022 ప్రారంభం నుంచి 2,80,000 కంటే ఎక్కువ మంది ఉద్యోగాలు కోల్పోయారు. వీరిలో 40 శాతం మంది ఈ ఏడాదిలోనే ఉద్యోగాలను కోల్పోయారు.
Read Also: Donald Trump: మూడో ప్రపంచ యుద్ధాన్ని ఆపే సత్తా నాకే ఉంది.. పుతిన్ నా మాట వింటాడు..
తాజాగా ఫేస్ బుక్, వాట్సాప్ మాతృసంస్థ రెండో విడతలో భారీగా ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది. ఏకంగా 10,000 మంది ఉద్యోగులను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. కంపెనీ పునర్నిర్మాణంలో భాగంగా మెటా ఉద్యోగులను తొలగిస్తోంది. నాలుగు నెలల క్రితం గత నవంబర్ లో 13 శాతం అంటే 11,000 మందిని తమ కంపెనీ నుంచి తొలగించింది. తాజాగా రెండో రౌండ్ లో 10 వేల మంది ఉద్యోగాలను కోల్పోనున్నారు. 2022 చివరి నాటికి మెటా కంపెనీలో ప్రపంచవ్యాప్తంగా 86,482 మంది ఉద్యోగులు ఉన్నారు. ఉద్యోగులను తొలగించే విషయమై కంపెనీ సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ ఉద్యోగులకు ఓ సందేశం పంపారు. ఫ్యూచరిస్టిక్ మెటావర్స్‌ను నిర్మించడానికి బిలియన్ల డాలర్లను కుమ్మరిస్తున్న మెటా, అధిక ద్రవ్యోల్బణం, పెరుగుతున్న వడ్డీ రేట్లను కారణంగా ప్రకటన ఆదాయం కోల్పోతోంది.
గతేడాది నవంబర్ నెలలో 13 శాతాన్ని తొలగించిన మెటా, దాని చరిత్రలోనే 18 ఏళ్ల తర్వాత భారీగా ఉద్యోగులను తొలగించింది. ఆర్థికమాంద్యం భయాలతో ఖర్చులను తగ్గించుకునే పనిలో పలు ఐటీ కంపెనీలు ఉద్యోగులను తీసేస్తున్నాయి. ఇప్పటికే అమెజాన్, మెటా, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి టెక్ దిగ్గజాలు తమ ఉద్యోగులను తొలగించుకున్నాయి. ఆ అమెజాన్ 18,000 మందిని, గూగుల్ 12,000, మెక్రోసాఫ్ట్ 10,000 మంది ఉద్యోగులను తొలగించింది. రానున్న రోజుల్లో మరిన్ని కంపెనీలు కూడా ఉద్యోగులను తొలగిస్తాయనే వార్తలు ఉద్యోగుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. తాజాగా మెటా ఏకంగా రెండు రౌండ్లలో కలుపుకుని 21 వేలమందికి ఉద్వాసన పలికింది.