Bomb Blast: ఆఫ్రికా దేశం సోమాలియాలో భారీ బాంబు పేలుడు సంభవించింది. శనివారం ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో మొత్తం 27 మంది మరణించినట్లు సీఎన్ఎన్ నివేదించింది. సోమాలియాలోని లోయర్ షాబెల్లె రీజియన్ లో ఘటన జరిగింది. చనిపోయిన వారిలో ఎక్కువ మంది చిన్నారులే ఉన్నారు. 53 మందికి తీవ్రగాయాలైనట్లు తెలుస్తోంది. మురాలే గ్రామంలోని జనాలే ఏరియాలోని ఫుట్ బాట్ ఫీల్డ్ లో ఈ పేలుడు జరిగింది.
అంతకుముందు సోమాలియా రాజధాని మొగదిషులోని బీచ్‌సైడ్ హోటల్‌లో ఇస్లామిక్ అల్-షబాబ్ ఉగ్రవాదులు ఆరు గంటల పాటు జరిపిన ముట్టడిలో ఆరుగురు పౌరులు మరణించారు మరియు 10 మంది గాయపడినట్లు పోలీసులు శనివారం తెలిపారు. శుక్రవారం రాత్రి 8 గంటలకు ఈ దాడి మొదలైంది. ఆల్ ఖైదాకు అనుబంధంగా పనిచేస్తున్న జిహాదీలు గత 15 ఏళ్లుగా అక్కడి ప్రజా ప్రభుత్వాన్ని దించేందుకు దాడులకు తెగబడుతున్నారు. తరుచుగా హోటళ్లను లక్ష్యంగా చేసుకుంటూ దాడులు చేస్తున్నారు. విదేశీయులు, అధికారులే టార్గెట్ గా దాడులకు తెగబడుతున్నారు. భద్రతా బలగాలు నిర్వహించిన ఆపరేషన్ లో 84 మందిని భద్రతాబలగాలు కాపాడాయి.
అల్ షబాబ్ ఉగ్రవాద సంస్థ సోమాలియను హస్తగతం చేసుకోవాలని ప్రయత్నిస్తోంది. ఆ దేశంలోని నగరాలు, పట్టణాల నుంచి ఉగ్రవాదుల్ని తరిమివేసినా కూడా.. దక్షిణ ప్రాంతంలోని పలు భాగాలను ఇది కంట్రోల్ చేస్తుంది. హసన్ షేక్ మొహముద్ సోమాలియా అధ్యక్షుడు అయిన తర్వాత ఉగ్రవాదులకు వ్యతిరేకంగా ‘‘ఆల్ అవుట్ వార్’’ ప్రారంభించారు. ఉగ్రవాదులను అణిచివేసే లక్ష్యంగా ఇది ప్రారంభమైంది.
