NTV Telugu Site icon

Donald Trump: రష్యా-ఉక్రెయిన్ శాంతికి ట్రంప్ ప్రణాళిక ఇదేనా..?

Donald Trump

Donald Trump

Donald Trump: రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు డొనాల్డ్ ట్రంప్ ఒక ప్రణాళికతో సిద్ధమైనట్లు తెలుస్తోంది. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేస్తానని పలు సందర్భాల్లో ట్రంప్ చెప్పాడు. ప్రస్తుతం అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ యుద్ధానికి ముగించేందుకు శాంతి ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. రష్యా, ఉక్రెయిన్ సైన్యాల మధ్య 800 మైళ్ల బఫర్ జోన్ అమలు చేయడానికి యూరోపియన్ సైనికులకు పిలుపునిచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

Read Also: PM Modi: “ఏక్ రహేంగే తో సేఫ్ రహేంగే”.. జార్ఖండ్‌లో నినదించిన మోడీ..

ట్రంప్ శాంతి ప్రణాళిక, అతడి ముగ్గురు సిబ్బందిచే వివరించబడింది. ప్రస్తుతం ఉక్రెయిన్‌ నాటో కూటమిలో చేరాలనే నిర్ణయాన్ని విడిచిపెట్టేందుకు అంగీకరించే అవకాశం ఉందని ది టెలిగ్రాఫ్ నివేదించింది. బదులుగా ఉక్రెయిన్‌కి అతిపెద్ద ఆయుధ సహకారాన్ని, నిధులను అందిస్తున్న యూఎస్, రష్యా యుద్ధాన్ని మళ్లీ పున: ప్రారంభించకుండా నిరోధించేందుకు ఉక్రెయిన్‌కి పూర్తి ఆయుధాలను పంపుతుంది. దీంతో పాటు బఫర్ జోన్‌లో పెట్రోలింగ్ చేసేందుకు యూఎస్ తన దళాలను పంపదు. ఈ బఫర్ జోన్‌లో అమెరికా సైన్యం కాకుండా పోలాండ్, జర్మన్, బ్రిటన్, ఫ్రెంచ్ దళాలను పంపించేందుకు వీలు కలుగుతుందని ట్రంప్ బృందంలోని ఒక సభ్యుడు చెప్పినట్లు ది టెలిగ్రాఫ్ నివేదించింది.

ఇటీవల ట్రంప్ గెలిచిన తర్వాత రష్యా అధినేత పుతిన్‌తో పాటు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా శుభాకాంక్షలు తెలిపారు. ఓ కార్యక్రమంలో ట్రంప్‌తో చర్చలకు సిద్ధంగా ఉన్నారా..? అని పుతిన్‌ని ప్రశ్నిస్తే, తాను సిద్ధమే అని చెప్పారు. అయితే, రష్యా బలగాలన్నింటిని బహిష్కరించి, క్రిమియాతో సహా రష్యా స్వాధీనం చేసుకున్న భూభాగాలను తిరిగి ఇచ్చే వరకు శాంతిని నెలకొల్పలేమని జెలెన్ స్కీ పదేపదే చెబుతున్నారు. రష్యా 2014లో క్రిమియా ద్వీపకల్పాన్ని స్వాధీనం చేసుకుంది. ఇది ఉక్రెయిన్ భూభాగంలో 20 శాతం లోపు ఉంటుంది.