Europe Heatwave: బాబోయ్ ఎండలు.. కరిగిపోతున్న రహదారులు

  • ఐరోపా దేశాలను దంచికొడుతున్న ఎండలు
  • తీవ్రమైన ఉక్కపోత, చెమటలతో హడల్
  • కరిగిపోతున్న రహదారులు.. వంకరగా ట్రామ్ పట్టాలు
France

France

ఐరోపా దేశాలను మునుపెన్నడూ లేనంతగా ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఉదయం నుంచే సుర్రుడు సుర్రుమంటున్నాడు. దీంతో బయటకు రావాలంటేనే ప్రజలు హడలెత్తిపోతున్నారు. తీవ్రమైన ఉక్కపోత, చెమటలతో అల్లాడిపోతున్నారు. దీంతో నదుల్లో.. ట్యాంక్‌ల దగ్గర స్నానాలు చేస్తూ సేదతీరుతున్నారు. ఇక తాజాగా రహదారులు కూడా కరిగిపోతున్నాయి. ట్రామ్ పట్టాలు వంకర తిరుగుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలతో వేలాది మంది ఆసుపత్రుల్లో చేరుతున్నారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెల్లడించిన వివరాల ప్రకారం.. జూన్ 21 నుంచి ఇప్పటివరకు యూరప్‌లో అధిక ఉష్ణోగ్రతల కారణంగా 1,300 మందికి పైగా అదనపు మరణాలు నమోదయ్యాయి. కార్లలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయిన చిన్నారులు, వేడి నుంచి ఉపశమనం కోసం పర్యవేక్షణ లేని నీటి ప్రాంతాల్లో ఈతకు వెళ్లి మునిగిపోయిన యువకులు కూడా ఉన్నారు.

ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో హీట్‌వేవ్ కారణంగా మరణాల సంఖ్య పెరగడంతో మార్చురీలు, అంత్యక్రియల కేంద్రాలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. జూన్ 18 నుంచి ఇప్పటివరకు ఫ్రాన్స్‌లో కనీసం 74 మంది నీటిలో మునిగి మరణించినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు కొంత తగ్గినా, జూలైలో మరోసారి తీవ్రమైన హీట్‌వేవ్ వచ్చే అవకాశం ఉందని అక్కడి వాతావరణ శాఖ హెచ్చరించింది. పశ్చిమ యూరప్‌లో ప్రారంభమైన ఈ హీట్‌వేవ్ ప్రస్తుతం తూర్పు యూరప్‌కు విస్తరించింది. పోలాండ్, చెక్ రిపబ్లిక్, జర్మనీ దేశాల్లో కొత్త ఉష్ణోగ్రత రికార్డులు నమోదయ్యాయి.

తీవ్ర ఎండల నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులు వీలైనంత వరకు ఇంటి నుంచే పని చేయాలని హంగేరీ ప్రభుత్వం సూచించింది. అలాగే బహిరంగ పనుల సమయాలను మార్చాలని, రెస్టారెంట్లు ఉచితంగా తాగునీరు అందించాలని, ఎయిర్ కండీషన్డ్ ప్రజా కేంద్రాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే యుద్ధ ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఉక్రెయిన్ విద్యుత్ వ్యవస్థపై హీట్‌వేవ్ మరింత భారం మోపింది. 35 డిగ్రీల నుంచి 38 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో అధికారులు అత్యవసర విద్యుత్ కోతలు అమలు చేస్తున్నారు.

తీవ్ర ఎండల ప్రభావాన్ని చూపించే అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓ వీడియోలో బయట ఎండలో ఉంచిన పాన్‌పై కొద్ది నిమిషాల్లోనే గుడ్లు, బేకన్ ఉడికిపోవడం కనిపించింది. జర్మనీలో రహదారులు కరిగిపోవడం, ట్రామ్ పట్టాలు వేడికి వంకర తిరగడం వంటి దృశ్యాలు కూడా వైరల్ అయ్యాయి. అలాగే బెర్లిన్‌లో ప్రజలను చల్లబరచేందుకు పోలీసులు వాటర్ కానన్‌లతో నీటి జల్లులు చల్లగా, స్థానికులు వాటి కింద నిలబడి ఉపశమనం పొందిన దృశ్యాలు కూడా సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.