Site icon NTV Telugu

Epstein Files: ఎప్‌స్టీన్ ఫైల్స్ నుంచి ట్రంప్ ఫొటోలు తొలగింపు! సమర్థించిన టాడ్ బ్లాంచే

Epstein Files2

Epstein Files2

అమెరికాలో సంచలనం సృష్టించిన ఎప్‌స్టీన్ ఫైల్స్‌లోని కొన్ని పత్రాలను శుక్రవారం న్యాయశాఖ విడుదల చేసింది. అయితే విడుదలైన పత్రాలు డెమొక్రాట్ల నేతల లక్ష్యంగా విడుదల చేసినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తాయి. తొలి విడత పత్రాల నివేదికలో ట్రంప్ ఫొటోలను తొలగించి విడుదల చేసినట్లుగా కొంతమంది బాధితులు, న్యాయవాద సంఘాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.

శుక్రవారం విడుదల చేసిన తొలి విడత పత్రాలు భారీగా సవరించబడ్డాయని.. చాలా తక్కువ కొత్త సమాచారాన్ని వెల్లడించాయని కొంత మంది బాధితులు న్యాయవాద సంఘాలతో సహా విమర్శకులు పేర్కొన్నారు.

అయితే ఈ ఆరోపణలపై అమెరికా డిప్యూటీ అటార్నీ జనరల్ టాడ్ బ్లాంచే శనివారం స్పందించారు. న్యాయశాఖ కరెక్ట్‌గానే వ్యవహరించిందని తెలిపారు. ట్రంప్ ఉన్న ఫొటోలను తొలగించడాన్ని కూడా టాడ్ బ్లాంచ్ వెనకేసుకొచ్చారు. ట్రంప్‌కు ఎటువంటి సంబంధం లేదని.. బాధిత న్యాయవాదుల సంఘాల అభ్యర్థన మేరకే ఫైల్స్ విడుదలయ్యాయని పేర్కొన్నారు. ఆదివారం జరిగిన మీట్ ది ప్రెస్‌లో కూడా మరోసారి టాడ్ బ్లాంచే మాట్లాడుతూ.. రాబోయే రెండు వారాల్లో మరిన్ని ఫైల్స్‌ను కూడా విడుదల చేస్తామని చెప్పారు. బాధితులను రక్షించేందుకు సవరణలు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. చట్టానికి లోబడే న్యాయశాఖ పని చేస్తోందని చెప్పారు. అన్ని పత్రాల్లో బాధితుల సమాచారం ఉందని వెల్లడించారు. బాధితులు అడిగితేనే కొన్ని చిత్రాలు తొలగించామని.. అంతే తప్పు అధ్యక్షుడు ట్రంప్‌కు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. బిల్ క్లింటన్‌పై దర్యాప్తు జరుగుతుందా? అనే విషయంపై మాత్రం సమాధానం చెప్పడానికి నిరాకరించారు.

శుక్రవారం విడుదలైన ఫొటోల్లో అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, మైఖేల్ జాక్సన్ కనిపించారు. బిల్ క్లింటన్.. గుర్తుతెలియని మహిళతో జలకాలాటలు ఆడుతున్నట్లు కనిపించింది. బిల్ క్లింటన్ జాకుజీలో గుర్తుతెలియని మహిళతో పడుకుని ఉన్న ఫొటో ఎప్పుడూ.. ఎక్కడ తీశారో మాత్రం పత్రాల్లో పేర్కొనలేదు. ఏదైనా చట్టవిరుద్ధమైన కార్యకలాపాల్లో పాల్గొన్నట్లుగా వెల్లడించలేదు. తాజాగా విడుదలైన చిత్రాల్లో ఎక్కువగా బిల్ క్లింటన్ ఉన్నారు. ప్రస్తుతం అధ్యక్షుడు ట్రంప్‌నకు సంబంధించిన చిత్రాలు మాత్రం కనిపించలేదు.

లైంగిక అక్రమ రవాణా ఆరోపణలపై విచారణ ఎదుర్కొంటున్న సమయంలో ఎప్‌స్టీన్ ఆగస్టు 2019లో మాన్‌హట్టన్‌లోని ఒక ఫెడరల్ జైలులో చనిపోయి కనిపించాడు. ఆత్మహత్య చేసుకున్నట్లుగా అధికారులు నిర్ధారించారు.

Exit mobile version