Donald Trump: అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి గెలిచిన డొనాల్డ్ ట్రంప్ జనవరి 20వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి బిలియనీర్లు, టెక్ దిగ్గజాలు ఎలాన్‌మస్క్, మార్క్ జుకర్‌బర్గ్, జెఫ్ బెజోస్ హాజరవుతారని పేర్కొన్నారు. అయితే, ట్రంప్ తొలిసారి అధ్యక్షుడిగా విజయం సాధించిన తర్వాత అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్‌కు, ట్రంప్‌నకు పడేది కాదు.. దీంతో బెజోస్ ఆధ్వర్యంలోని వాషింగ్టన్ పోస్ట్ దిన పత్రిక డొనాల్డ్ ట్రంప్ విధానాలపై విమర్శలు గుప్పించేది. మెటా చీఫ్ మార్క్ జుకర్‌బర్గ్‌కు, ట్రంప్‌నకు మధ్య కూడా గొడవలు జరిగాయి.. 2021లో యూఎస్ పార్లమెంట్ భవనంపై ట్రంప్ అనుచరులు దాడి చేయడంతో అతడ్ని ఫేస్ బుక్ నుంచి తొలగించారు. ఇక, 2023లో ట్రంప్ ఫేస్ బుక్ ఖాతాను మరోసారి పునరుద్ధరించారు. అయినా జుకర్ బర్గ్‌పై ట్రంప్ మండిపడేవారు. కానీ, ఇప్పుడు వీరందరి మధ్య సయోధ్య కుదిరినట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి.
Read Also: Non Veg Market: పండగ పూట మటన్, చికెన్ ధరలకు రెక్కలు..
అయితే, ఇటీవల జరిగిన ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ తిరిగి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికవడంతో ఈ టెక్ దిగ్గజాలు పాత విభేదాలను వదిలి పెట్టి ఆయనకు దగ్గరయ్యారు. దీంతో ట్రంప్ పదవీ స్వీకార సమయంలో వేడుకలు, ఇతర ప్రారంభోత్సవ కార్యక్రమాల నిర్వహణ నిధికి జెఫ్ బెజోస్, జుకర్ బర్గ్ లాంటి వారు విరాళాలు అందజేశారు. అమెజాన్ ప్రైమ్‌లో ట్రంప్ పదవీ ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుందని కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికైన తర్వాత వీరిరువురూ వ్యక్తిగతంగా కలిసే అవకాశం ఉంది.
Read Also: Sankrantiki vastunnam : వెంకీ మామ కెరీర్లోనే ది బెస్ట్ ఓపెనింగ్స్.. ఎన్నికోట్లు కలెక్ట్ చేసిందంటే
ఇక, జనవరి 20వ తేదీన అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఈ కార్యక్రమం అమెరికాలోని వెస్ట్ ఫ్రంట్ ప్రాంతంలో వేదికను ఏర్పాటు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ప్రపంచ దేశాధినేతలు ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి రానున్నట్లు తెలుస్తుంది. కాగా, ఈ కార్యక్రమంలో భారత్ తరఫున విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ హాజరుకానున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.